Updated : 19 May 2022 10:54 IST

Wheat Exports: ఆహార ధాన్యాలు.. కరోనా వ్యాక్సిన్లలా కాకూడదు..!

అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాలకు భారత్‌ కౌంటర్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. భారత్‌ దీటుగా స్పందించింది. అవసరమైన వారికి ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్‌ వ్యాక్సిన్ల మాదిరిగా ఉండకూడదంటూ అంతర్జాతీయ వేదికగా పశ్చిమ దేశాలకు హితవు పలికింది.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కాల్‌ టు యాక్షన్‌’ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ సదస్సులో భారత్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అల్పాదాయ దేశాలు నేడు రెండు ఇబ్బందులను ఒకేసారి ఎదుర్కొంటున్నాయి. ఒకటి ధరల పెరుగుదల. రెండోది ఆహార ధాన్యాలను కొరత. భారత్‌ లాంటి దేశాలు కూడా సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ.. అన్యాయమైన ధరల పెరుగుదలను చవిచూస్తున్నాయి. కొన్ని దేశాలు అధిక నిల్వలను ఉంచుకోవడం, సరఫరాపై వస్తోన్న ఊహాగానాలే ఇందుకు కారణం. ఇదిలాగే కొనసాగడం మంచిది కాదు’’ అని చెప్పుకొచ్చారు.

నిషేధం అందుకే..

అంతర్జాతీయంగా గోధుమ ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశీయ ఆహార భద్రతతో పాటు పొరుగుదేశాలు, ఇతర దుర్భల దేశాలకు ముప్పు వాటిల్లనుందని తాము గుర్తించినట్లు మురళీధరన్‌ తెలిపారు. ‘‘దేశ ఆహార భద్రతపై ఈ ప్రభావం పడకుండా చూడటంతో పాటు అత్యంత అవసరమున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే గోధుమ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించాం’ అని కేంద్రమంత్రి వెల్లడించారు. గోధుమలపై నిషేధం విధిస్తూనే కొన్ని సడలింపులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు దిగుమతులు అత్యవసరమైన దేశాలు అభ్యర్థిస్తే తప్పకుండా వారికి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ సందర్భంగా పశ్చిమ దేశాలను ఉద్దేశిస్తూ భారత్ హెచ్చరికలు చేసింది. కొన్ని ధనిక దేశాలకు తమకు అవసరమున్న దాని కంటే అధికంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను నిల్వ చేసుకోవడంతో పేద, మధ్యాదాయ దేశాల్లోని ప్రజలుకు కనీసం తొలి డోసు కూడా అందలేని పరిస్థితి నెలకొందని మురళీధరన్‌ గుర్తు చేశారు.  ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరిగా కాకూడదని పశ్చిమ దేశాలకు సూచించింది. ‘‘ఆహార ధాన్యాల విషయలో సమానత్వం, స్థాయి, అందుబాటు ప్రాముఖ్యాన్ని మనమంతా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని భారత్ పిలుపునిచ్చింది.

ఒత్తిడి, సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని మురళీధరన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘‘మా పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికాలో ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు భారత్ ప్రభుత్వం వేలాది మెట్రిక్‌ టన్నుల గోధుమలు, బియ్యం, పప్పు దినుసుల వంటి వాటిని పలు దేశాలకు పంపిస్తోంది. అఫ్గానిస్థాన్‌లో మానవతా సంక్షోభం నెలకొన్నప్పుడు 50వేల టన్నుల గోధుమలను పంపించాం. శ్రీలంక, మయన్మార్‌ దేశాలను కూడా కష్టసమయంలో ఆదుకుంటున్నాం. వసుధైక కుటుంబమే మా విధానం’’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని