MEA: చైనా విమర్శలకు దీటుగా బదులిచ్చిన భారత్‌

ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్‌ దీటుగా ......

Published : 08 Jul 2022 00:56 IST

దిల్లీ: ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్‌లో గౌరవ అతిథి అని.. ఆయనకు భారత్‌లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. గతేడాది కూడా దలైలామాకు మోదీ శుభాకాంక్షలు చెప్పినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఆయన మత గురువు అని.. వారి మతపరమైన కార్యకలాపాలకు దేశంలో స్వేచ్ఛ ఉందన్నారు. 

దలైలామా 87వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఫోన్‌లో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా విమర్శలు చేసింది. టిబెట్‌ సంబంధిత అంశాల ద్వారా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత్‌ ఆపాలని సూచించింది. దలైలామా అనుసరిస్తున్న చైనా వ్యతిరేక వైఖరిని భారత్‌ పూర్తిస్థాయిలో గుర్తించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పష్టంచేశారు.  దలైలామాకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌పైనా లిజియాన్‌ విమర్శలు చేశారు. టిబెట్‌ అంశం చైనా అంతర్గత విషయమని.. ఇందులో విదేశీ జోక్యం ఉండరాదన్నారు. దలైలామాతో ఏ దేశమైనా బంధం నెరపడానికి తాము వ్యతిరేకమని పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్‌ వ్యాఖ్యలకు భారత్‌ పైవిధంగా స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని