Ukraine crisis: నిజమే.. ఆ పని అమెరికా ఎప్పుడో చేయాల్సింది..!

భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధం బలపడుతోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పని

Published : 28 Apr 2022 11:38 IST

 అగ్రరాజ్య లోపాన్ని అంగీకరించిన బ్లింకన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధం బలపడుతోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌ తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకొందని వెల్లడించారు. అమెరికాలోని కాంగ్రెస్‌ విచారణ సందర్భంగా భారత్‌-అమెరికా సంబంధాలపై బ్లింకన్‌ అభిప్రాయం చెప్పాలని సెనెటర్‌ విలియమ్‌ హెగర్టీ  కోరారు. 

బ్లింకన్‌ దీనికి స్పందిస్తూ ‘‘భారత్‌ విషయాన్నే చూడండి. రష్యాతో వారి సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌-రష్యా భాగస్వామ్యం ఏర్పడింది. ఆ సమయంలో భారత్‌తో భాగస్వామ్యానికి నాడు అమెరికా సిద్ధంగా లేదు. కానీ, ఇప్పుడు మనం ఆ దిశగా దృష్టిపెట్టాము. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతోందని నేను అనుకొంటున్నాను. దీనికి చైనానే ఓ పెద్ద కారణం’’ అని పేర్కొన్నారు. 

అంతకు ముందు హెగర్టీ మాట్లాడుతూ ‘‘నేను చూసింది ఏమిటంటే.. స్వల్పకాలిక విభేదాలు తలెత్తినప్పుడు తీవ్ర నిరాశ చెందుతాము. అలాంటి వాటిని ఎదుర్కొంటూనే మీరు రోజు పనిచేస్తారు. కానీ, దీర్ఘకాలంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తే.. 21వ శతాబ్దంలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. బ్లింకన్‌ కూడా హెగర్టీ అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవించారు. రానున్న దశాబ్దాల్లో ముందుకు వెళ్లడానికి ఈ భాగస్వామ్యం చాలా కీలకమైందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా ఇప్పటికే భారత భాగస్వాములతో కలిసి చర్చలు జరిపేందుకు చాలా సమయం వెచ్చించారని పేర్కొన్నారు. భారత్‌ను జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిసి పనిచేసేలా చేయడంలో క్వాడ్‌ది కీలక భూమికగా బ్లింకన్‌ అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని