QUAD: క్వాడ్‌కు భారత్‌ ఓ చోదక శక్తి: అమెరికా

భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘క్వాడ్‌ కూటమి’కి భారత్‌ ఓ చోదక శక్తి వంటిదని అమెరికా తెలిపింది.

Published : 15 Feb 2022 12:22 IST

వాషింగ్టన్‌: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘క్వాడ్‌ కూటమి’కి భారత్‌ ఓ చోదక శక్తి వంటిదని అమెరికా తెలిపింది. శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరిగిన క్వాడ్‌ కూటమి మంత్రుల సమావేశం ముగిసిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ భేటీలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా అనుసరిస్తున్న బెదిరింపు ధోరణులను ‘క్వాడ్‌ కూటమి’ తప్పుబట్టింది. ఇలాంటి విధానాల నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు తమ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించింది. చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశ వైఖరిని నిరసించింది.

‘‘దక్షిణాసియా, హిందూ మహాసముద్రంలో భారత్‌ ఓ లీడర్‌. అలాగే ఆగ్నేయాసియాలో క్రియాశీలకంగా ఉన్న దేశంగా.. క్వాడ్‌కు ఓ చోదకశక్తి. ప్రాంతీయ అభివృద్ధికి ఓ ఇంజిన్‌ లాంటిది’’ అని శ్వేతసౌధం ప్రధాన డిప్యూటీ ప్రెస్‌ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పుపై చర్చించేందుకూ అవకాశం దొరికిందన్నారు. రష్యా వైఖరి వల్ల ఉక్రెయిన్‌తో పాటు యావత్తు ప్రపంచానికి ఉన్న ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

దక్షిణాసియాలో స్థిరత్వానికి భారత్‌తో కలిసి కృషి చేస్తామని అమెరికా ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్‌, మరింత బలమైన ఆర్థిక, సాంకేతికత రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది. అయితే, కేవలం ఏదో ఒక్క దేశం విధించే ఆంక్షలను భారత్‌ పట్టించుకోదని.. బహుముఖ, బహువిధ ఆంక్షలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించడంలో అమెరికా కొంత సంయమనం పాటించడం గమనార్హం.

రష్యా నుంచి భారత్‌ ఎస్‌-400 గగనతల క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌పై అమెరికా కాట్సా ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు.. వాటిపై అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని