Bill Gates: ఏకకాలంలో సమస్యల పరిష్కారం.. భారత్‌తో భవిష్యత్తుపై ఆశ!

సంక్షోభాల సమయంలోనూ పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదనీ భారత్‌ నిరూపించిందని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. భవిష్యత్తుపై ఆ దేశం ఆశను కలిగిస్తోందన్నారు. త్వరలో భారత్‌ను సందర్శించనున్నట్లు చెప్పారు.

Updated : 23 Feb 2023 13:14 IST

వాషింగ్టన్‌: భవిష్యత్తుపై భారత్‌ ఆశను కలిగిస్తోందని మైక్రోసాఫ్ట్‌(Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్(Bill Gates) పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలోనూ పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదనీ ఆ దేశం నిరూపించినట్లు తాజాగా తన బ్లాగ్‌ ‘గేట్స్ నోట్స్(Gates Notes)’లో తెలిపారు. ఈ క్రమంలోనే వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో క్షేత్రస్థాయిలో ఆవిష్కర్తలు, నిపుణులు సాధిస్తోన్న ప్రగతిని పరిశీలించేందుకు త్వరలో భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) ట్విటర్‌ వేదికగా బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలను షేర్‌ చేసింది.

‘సరైన ఆవిష్కరణలు, డెలివరీ మాధ్యమాలతో ప్రపంచం ఒకేసారి పెద్ద సమస్యలపై పురోగతి సాధించగలదు. అయితే, దీనికి సమయం, డబ్బు సరిపోదనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. కానీ, భారత్‌ ఇవన్నీ తప్పు అని నిరూపించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనున్న ఆ దేశం.. పెద్ద సవాళ్లను ఎదుర్కోగలదని చాటుకుంది. పోలియోను నిర్మూలించింది. హెచ్‌ఐవీ వ్యాప్తిని కట్టడి చేసింది. పేదరికం, శిశు మరణాలను తగ్గించింది. పారిశుద్ధ్యం, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేసింది. భారత్‌ సాధించిన అద్భుతమైన పురోగతికి మించిన రుజువు లేదు. మొత్తంగా భవిష్యత్తుపై ఆశను కలిగిస్తోంది’ అని బిల్‌గేట్స్‌ అన్నారు.

‘ఆవిష్కరణలు, వాటిని ప్రజలకు చేరువ చేసే మాధ్యమాల విషయంలో భారత్‌.. ప్రపంచంలోనే ఉత్తమమైన విధానాన్ని అభివృద్ధి చేసింది. ప్రాణాంతకమైన డయేరియాకు కారణమయ్యే రోటావైరస్‌ను కట్టడిచేసే వ్యాక్సిన్‌ను సొంతంగా ఉత్పత్తి చేసి, కిందిస్థాయి వరకు చేరవేసింది. దీంతో 2021 నాటికి 83 శాతం మంది పిల్లలకు రోటావైరస్ టీకాలు అందాయి. అందుబాటు ధరలో ఉండే ఈ టీకాలను ఇప్పుడు ఇతర దేశాల్లోనూ వినియోగిస్తున్నారు’ అని బిల్‌గేట్స్‌ గుర్తుచేశారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(IARI) శాస్త్రవేత్తలు10 శాతానికిపైగా ఎక్కువ దిగుబడి, తీవ్ర కరవును తట్టుకోగల శనగల రకాలను ఉత్పత్తి చేసినట్లు ప్రస్తావించారు. ఇక్కడ పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం, సీజీఐఏఆర్‌ సంస్థలతో గేట్స్‌ ఫౌండేషన్‌ చేతులు కలిపింది.

‘ఇతర దేశాల మాదిరిగానే.. భారత్‌ కూడా పరిమిత వనరులను కలిగి ఉంది. అయినప్పటికీ.. ఎలా పురోగతి సాధించగలదో నిరూపించింది. దేశ ప్రజలకు ఆహార భద్రత, రైతులకు ప్రోత్సాహం విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. సరికొత్త విధానాలు, ప్రభుత్వ, ప్రైవేటు, దాతృత్వ రంగాల పరస్పర సహకారంతో.. పరిమిత వనరులతోనే అభివృద్ధికి బాటలు వేయొచ్చు. అంతా కలిసి పని చేస్తే వాతావరణ మార్పులతో పోరాడగలం. అదే సమయంలో ప్రపంచాన్ని మెరుగుపరచగలం’ అని బిల్‌గేట్స్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని