Modi-Putin: చిన్నారుల మరణాలపై పుతిన్‌ వద్ద మోదీ ఆందోళన..స్పందించిన అమెరికా

ఉక్రెయిన్ యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) వద్ద మోదీ(PM Modi) ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. 

Published : 10 Jul 2024 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ అంచనాలకు తగ్గట్టే ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) వద్ద ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో రెండురోజుల క్రితం రష్యా జరిపిన క్షిపణి దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మోదీ పర్యటన సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దీనిగురించి పుతిన్‌ వద్ద మన ప్రధాని ప్రస్తావించారు. చిన్నారుల మరణాలు తనను కదిలించాయని ఆయన వద్ద ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పర్యటనను సాంతం గమనించిన అమెరికా మోదీ చేసిన వ్యాఖ్యపై తాజాగా స్పందించింది. 

రష్యా వెళ్లిన మోదీ.. మంగళవారం పుతిన్‌తో కలిసి ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ‘‘యుద్ధం, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలు ఏవైనాకానీ.. వాటివల్ల సాధారణ పౌరులు మరణిస్తే మరీ ముఖ్యంగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతే.. మానవత్వాన్ని విశ్వసించే ప్రతీ వ్యక్తి బాధ పడతారు. అలాంటి బాధ కలిగినప్పుడు హృదయం ద్రవిస్తుంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. యుద్ధ రంగంలో పరిష్కారం లభించబోదని పుతిన్‌కు తేల్చి చెప్పారు. చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే రష్యా, ఉక్రెయిన్‌ ఘర్షణకు పరిష్కారం లభించగలదని నమ్ముతున్నామని స్పష్టంచేశారు. 

‘‘భారత్‌ శాంతి వైపే ఉందని మీతో పాటు అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నాను. భేటీలో మీ మాటలు నాకు నమ్మకాన్ని ఇచ్చాయి. భావితరాలకు మెరుగైన భవిష్యత్తు ఉండాలంటే శాంతి అత్యావశ్యకం. బాంబులు, గన్స్‌, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావు’’ అని వ్యాఖ్యానించిన మోదీ..శాంతి పునరుద్ధరణకు భారత్ అన్నిరకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మోదీ-పుతిన్ భేటీపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యద్ధం ముగించాలని పుతిన్‌ను కోరే చొరవ భారత్‌కు ఉందని పేర్కొంది. అందుకు ఆ రెండు దేశాల మధ్య ఉన్న బంధమే కారణమని వ్యాఖ్యానించింది. 

ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. రాజధాని కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడుల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారని, 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఆసుపత్రిపై దాడితో ఎంతోమంది శిథిలాల కింద సమాధి అయ్యారని, ఇలాంటి ఘటనలపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని