Cyber crimes: సైబర్‌ క్రైమ్‌ బాధితుల్లో భారత్‌ స్థానమెంతో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌క్రైం బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) వెల్లడించింది.

Published : 31 May 2022 02:09 IST

అమెరికా ఎఫ్‌బీఐ నివేదిక

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌క్రైం బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) వెల్లడించింది. అయితే, భారత్‌లో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ అమెరికా, బ్రిటన్‌ దేశాల్లోనే సైబర్‌ నేరాల బాధితుల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు తెలిపింది. ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లయింట్‌ సెంటర్‌ (IC3) నివేదిక ఆధారంగా ఎఫ్‌బీఐ వీటిని రూపొందించింది.

ఎఫ్‌బీఐ నివేదిక ప్రకారం, 2021లో అమెరికాలో 4,66,501మంది సైబర్‌క్రైం బాధితులుగా నమోదుకాగా.. బ్రిటన్‌లో ఈ సంఖ్య 3,03,949గా ఉంది. ఇక కెనడాలో 5788, భారత్‌లో 3131 మంది బాధితులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సైబర్‌ క్రైం కేసులు నమోదవుతోన్న 20 దేశాల జాబితాను రూపొందించింది. పాకిస్థాన్‌, చైనా దేశాలు సైబర్‌ క్రైం బాధితుల్లో భారత్‌ తర్వాతే ఉన్నాయి. మిగతా దేశాలన్నింటిలో కలిపి బాధితుల సంఖ్య 25వేలుగా నమోదయ్యింది.

సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి 2017-2021 మధ్యకాలంలో ఐసీ3కి మొత్తం 27,60,044 ఫిర్యాదులు వచ్చాయి. ఇక టెక్‌ సపోర్టు మోసాలకు సంబంధించి 70 దేశాల నుంచి 23,903 ఫిర్యాదులు వచ్చినట్లు ఐసీ3 వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కస్టమర్‌ సపోర్టు, భద్రత, సాంకేతిక సహాయం అందిస్తామని చేసే మోసాలే ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఇటువంటి మోసకారులు భారత్‌ కేంద్రంగానే ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు ఐసీ3 వెల్లడించింది. వీటివల్ల ఏటా వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని ఎఫ్‌బీఐ నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని