Joe Biden: రష్యాపై చర్యల విషయంలో భారత్ స్పందన బలహీనం.. బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోన్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు

Updated : 22 Mar 2022 13:01 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోన్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ ఎందుకో బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే.. దిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘పుతిన్‌ గురించి నాకు బాగా తెలుసు. నాటోను విభజించగలనని బలంగా నమ్ముతూ పుతిన్‌ లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ, ఆయన లెక్క తప్పింది. నాటో కూటమి ఐక్యంగా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఇదంతా రష్యా వల్లే అనుకుంటున్నాను. అయితే, పుతిన్‌ దూకుడును అడ్డుకోవడంలో నాటో, అమెరికా మిత్ర దేశాలు, ఐరోపా సమాఖ్య, ఆసియా భాగస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. క్వాడ్‌ కూటమిలోనూ జపాన్‌, అస్ట్రేలియా దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, ఒక్క భారత్‌ మాత్రమే ఈ విషయంలో ఎందుకో బలహీనంగా ఉంది. రష్యాపై ఆంక్షల వంటి చర్యలు తీసుకునే విషయంలో అస్థిరంగా ఉంది’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. 

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పలు నగరాలపై రష్యా సేనలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెమ్లిన్‌ దురాక్రమణను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించాయి. మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. భారత్‌కు చౌక ధరకు చమురు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీనికి భారత్‌ కూడా అంగీకరించింది. 

రష్యా నుంచి దాదాపు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్‌లో కొనుగోలు చేసింది. కాగా.. ఈ పరిణామాలపై ఇటీవల స్పందించిన అమెరికా.. భారత్‌ ఒప్పందం ఆంక్షల పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో తాము ఎటు పక్క నిలిచామో, రేపు చరిత్ర పుస్తకాల్లో తమ గురించి ఏమని రాస్తారో ప్రతి దేశమూ గుర్తుంచుకొని వ్యవహరించాలని హెచ్చరించింది. 

అంతకుముందు.. రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి వేదికగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్‌ దూరంగా ఉంటూ వచ్చింది. తాము యుద్ధానికి వ్యతిరేకమన్న భారత్‌.. చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ పరిణామాలపైనే బైడెన్‌ తాజాగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని