Modi: మోదీ ఈజ్ ది బాస్: ఆస్ట్రేలియాలో ప్రధానికి విశేష ఆదరణ.. ఆశ్చర్యపోయిన అల్బనీస్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi)కి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన ఒక బాస్ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పొగడ్తల వర్షం కురిపించారు. మరోపక్క.. మోదీ భారత్ సాధిస్తోన్న విజయాలపై ప్రవాస భారతీయులకు వెల్లడించారు.
సిడ్నీ: ప్రపంచంలోనే అతిపెద్ద ‘టాలెంట్ ఫ్యాక్టరీ’ భారత్‌లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పేర్కొన్నారు. ఆస్ట్రేలియా(Australian) పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సిడ్నీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆస్ట్రేలియాతో బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలను అనుసంధానిస్తోన్న ‘3C’ల గురించి ప్రస్తావించారు. మరోపక్క.. మోదీపై ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసలు కురిపించారు.
‘కొన్ని తరాలుగా క్రికెట్.. మన రెండు దేశాలను కలిపి ఉంచుతోంది. ఇప్పుడు టెన్నిస్, సినిమాలు, యోగా, ప్రవాసభారతీయ కమ్యూనిటీ మన బంధాన్ని బలోపేతం చేయడంలో దోహదం చేస్తున్నాయి. మన బంధాన్ని నిర్వచించడానికి ‘3C’లు ముఖ్యమైనవి. అవి.. కామన్వెల్త్, క్రికెట్, కర్రీ. వాటితో పాటు 3Dలు.. డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ, 3Eలు.. ఎనర్జీ, ఎకనామీ, ఎడ్యుకేషన్ ఉన్నాయి. కానీ, వాస్తవంలో వీటన్నింటినీ దాటుకొని ఆస్ట్రేలియాతో భారత్ బంధం బలపడింది. అందుకు కారణం పరస్పర నమ్మకం, గౌరవం. ఇక్కడి ప్రజలు విశాలహృదయులు. భారతీయులను అక్కున చేర్చుకున్నారు. భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియా(Australian)లో ప్రముఖంగా వినిపిస్తాయి. నేను మళ్లీ వస్తానని 2014లోనే మీకు వాగ్దానం చేశాను. మళ్లీ వచ్చి నా వాగ్దానం నెరవేర్చుకున్నా’ అని మోదీ అన్నారు.
భారత్ నిలకడగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ ఫ్యాక్టరీ ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఐఎంఎఫ్ ఒక ఆశాకిరణంగా చూస్తోందని చెప్పారు. ‘ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే దేశం భారత్ అని ప్రపంచబ్యాంకు చెప్పింది. అలాంటి సవాళ్లలో కూడా ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రతి దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది. కానీ భారత బ్యాంకింగ్ వ్యవస్థకు అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయి’అని వెల్లడించారు. అలాగే మన దేశం సాధించిన అనేక విజయాల గురించి ప్రస్తావించారు.
మోదీ ఈజ్ ది బాస్: అల్బనీస్
భారత ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని, రాక్‌స్టార్ రిసెప్షన్ ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Australian PM Anthony Albanese) అన్నారు. మోదీని డియర్ ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన.. మన ప్రధానిని అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. ‘చివరిసారిగా నేను ఈ వేదికపై బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ను చూశాను. ఆయనకు కూడా ఇంత స్పందన రాలేదు. మోదీ ఈజీ ది బాస్’ అని ఆయనకు లభిస్తోన్న ఆదరణను చూసి అల్బనీస్ ఆశ్చర్యపోయారు. అలాగే బ్రిస్బేన్‌లో త్వరలో కొత్త భారత కాన్సులేట్ ప్రారంభమవుతుందని ఇద్దరు నేతలు ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో ‘లిటిల్ ఇండియా’..
ఇరు దేశాల మైత్రి, ప్రవాస భారతీయులు అందిస్తోన్న సహకారానికి గుర్తుగా.. ఇద్దరు నేతలు ‘లిటిల్ ఇండియా’కు శంకుస్థాపన చేశారు. సిడ్నీలోని హారిస్ పార్క్‌లో ఈ ‘లిటిల్ ఇండియా’గేట్‌వేను నిర్మించనున్నారు. ఈ పార్క్ వద్ద భారతీయ కమ్యూనిటీ దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి పలు వేడుకలను నిర్వహిస్తుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!