Japan: చైనాకు చెక్‌ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల స్థాపనకు భారత్‌ కీలకమని జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన ‘స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్‌’ ప్రణాళికను ఆవిష్కరించారు.

Published : 21 Mar 2023 01:41 IST

దిల్లీ: ఇండో- పసిఫిక్‌(Indo- Pacific) ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు జపాన్(Japan) కీలక ‘స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్‌(FOIP)’ ప్రణాళికను ఆవిష్కరించింది. పారిశ్రామిక రంగం నుంచి విపత్తు నివారణ వరకు ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థలకు అండగా నిలిచేందుకు రూ.6 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను ప్రకటించింది. ప్రభుత్వ సాయం, గ్రాంట్లతోపాటు ప్రైవేటు పెట్టుబడులు, రుణాల ద్వారా 2030 నాటికి ఈ సాయాన్ని అందజేస్తామని జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా(Fumio Kishida) హామీ ఇచ్చారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వ స్థాపనలో భారత్‌ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఎఫ్‌ఓఐపీ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇదొక దూరదృష్టితో కూడిన విధానమని, చట్టబద్ధ పాలన, స్వేచ్ఛను పరిరక్షిస్తుందని తెలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషిదా పునరుద్ఘాటించారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారం వంటి అంశాల్లో అన్ని దేశాలు అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ క్రమంలో ఏ దేశం కూడా బలప్రయోగానికి దిగకూడదని వ్యాఖ్యానించారు. ఇది యుద్ధాల శకం కాదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. శాంతిస్థాపనే పరమావధి అని తెలిపారు. ఒకవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. మరోవైపు ఇండో- పసిఫిక్‌లో చైనా దూకుడుపై ఆందోళనలు పెరుగుతున్న వేళ కిషిదా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జీ7 సదస్సుకు ఆహ్వానం

జపాన్‌లోని హిరోషిమాలో ఈ ఏడాది ‘జీ7’ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సులో పాల్గొనాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్‌ పీఎం కిషిదా ఆహ్వానం అందజేశారు. ప్రధాని మోదీ ఈ ఆహ్వానాన్ని స్వీకరించినట్టు విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా తెలిపారు. ఇదిలా ఉండగా.. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ, ఇటలీ, కెనడాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆయా దేశాల ఆహ్వానం మేరకు భారత్‌ కూడా ఏటా ఈ సదస్సులో భాగస్వామ్యమవుతోంది. అంతకుమందు కిషిదా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్‌- జపాన్‌ల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్య బలోపేతానికి పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని