G20 meet in Kashmir: తగ్గేదేలే.. జమ్ము కశ్మీర్‌లో జీ-20 సమావేశం ఖాయం

జమ్ముకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహణ విషయంలో భారత్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ విషయాన్ని ఇటీవల భారత్‌ మరోసారి స్పష్టం చేసింది.

Published : 18 Mar 2023 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ముకశ్మీర్‌లో జీ20 సదస్సు నిర్వహించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని భారత్‌ (India) నిర్ణయించింది. ఇప్పటికే పాకిస్థాన్‌ (Pakistan) ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చైనా, తుర్కియే, సౌదీ అరేబియాతో కలిసి లాబీయింగ్‌ చేపట్టింది. కానీ, భారత్‌ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ .. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీ-20 సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు  ఇవి జరుగుతాయన్నారు. వచ్చే వారం ఓ జీ-20 సమావేశం అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమెరికా 12, చైనా 14, ఇండోనేసియా 25 నగరాల్లో జీ-20  సదస్సులు నిర్వహించాయని గుర్తుచేశారు.

జమ్ము కశ్మీర్‌లో జీ-20 దేశాల సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో సంస్కృతులను రక్షించుకోవడం, డిజిటల్‌ టెక్నాలజీని సాంస్కృతిక పరిరక్షణలో వినియోగించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే శ్రీనగర్‌లో జీ-20 సదస్సు ఏర్పాటుకు సన్నాహాలు చేయాల్సిందిగా స్థానిక అధికారులకు కేంద్రం నుంచి వర్తమానం వెళ్లినట్లు సమాచారం. 

జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని ప్రపంచానికి తెలియజేసేందుకు కేంద్రం జీ-20 సదస్సును వేదికగా వాడుకోవాలనుకొంటోంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా  జీ-20 అతిథులను వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. మరోవైపు చైనా మాత్రం పాక్‌కు మద్దతుగా తన అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించింది. సంబంధిత వర్గాలు ఆర్థికంగా కోలుకోవడంపై దృష్టిపెట్టాలని.. సంబంధిత అంశాలను రాజకీయం చేయకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు సహకరించాలని కోరింది. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొనే అంశంపై ఎటువంటి వ్యాఖ్య చేయలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు