India at UN: భారత్‌ ఒక వారధి.. గళం.. దారి.. దృక్కోణం: జైశంకర్‌

భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారతదేశ పాత్ర చాలా ముఖ్యమైనదని విదేశాంగమంత్రి జైశంకర్‌ అన్నారు....

Updated : 25 Sep 2022 11:02 IST

న్యూయార్క్‌: భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారతదేశ పాత్ర చాలా కీలకమైందని విదేశాంగమంత్రి జైశంకర్‌ అన్నారు. ప్రపంచం భారత్‌ను తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణిస్తోందని తెలిపారు. ఐరాస సర్వప్రతినిధి సభలో శనివారం ప్రసంగించిన ఆయన సుదీర్ఘ అమెరికా పర్యటనలో ఒక భాగం పూర్తిచేసుకున్నారు. ఆదివారం వాషింగ్టన్‌కు బయలుదేరనున్న ఆయన మరిన్ని సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు ఆయన వివిధ దేశాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా ప్రతినిధులు, విదేశాంగమంత్రులతో భేటీ అయ్యారు.

‘‘ఈ ఐరాస సాధారణ అసెంబ్లీ ప్రపంచ స్థితిని ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచం ప్రస్తుతం భిన్న ధ్రువాలుగా విడిపోయింది. ప్రస్తుత ప్రపంచ గతిని గమనిస్తే.. భారతదేశ పాత్ర చాలా ముఖ్యమైందని స్పష్టమవుతోంది. భారత్‌ ఒక వారధి. ఒక గళం. ఒక దృక్కోణం. ఒక దారి’’ అని తన పర్యటనలోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ విలేకరులతో జైశంకర్‌ అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంక్షోభం నెలకొని ఉందని జైశంకర్‌ అన్నారు. ఆహారం, ఇంధన ధరలు ఎగబాకాయని గుర్తుచేశారు. ఎరువులపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. అనేక దేశాలకు రుణాలు గుదిబండగా మారాయని తెలిపారు. అయితే, ఈ అంశాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న అసహనం కొన్ని దేశాల్లో ఉందన్నారు. వాటినెవరూ లేవనెత్తడం లేదని ఆందోళన చెందుతున్నాయన్నారు. అంతర్జాతీయ వేదికలపై వీటికి ప్రాధాన్యం లభించడం లేదని వాపోతున్నాయని తెలిపారు. వీటన్నింటి గురించి ప్రస్తావిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే.. అది భారత్‌ ఒక్కటే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రపంచంలో భారత్‌ పాత్ర కీలకమైందని భావిస్తున్నామన్నారు.

ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. ఆయన ప్రతిష్ఠ, ప్రపంచ వేదికలపై భారత్‌కు ఆయన తీసుకొచ్చిన కీర్తే కారణమన్నారు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌26 పర్యావరణ సదస్సులో మోదీ పోషించిన పాత్రను చాలా దేశాల ప్రతినిధులు తనతో ప్రస్తావించారని తెలిపారు. అలాగే ఇటీవల జరిగిన పలు ప్రాంతీయ సదస్సుల్లోనూ ఆయన వాటిపై నొక్కి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారన్నారు. అందువల్లే భారత్‌ పాత్ర కీలకంగా మారిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని