China: చైనా నుంచి పాక్‌కు నిషేధిత రసాయనాలు.. అడ్డుకున్న భారత్‌!

చైనా నుంచి పాకిస్థాన్‌కు తరలిస్తోన్న నిషేధిత రసాయనాలను భారత్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 11 Jul 2024 17:49 IST

చెన్నై: చైనా (China) నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి అవుతోన్న నిషేధిత రసాయనాలను తమిళనాడు (Tamil Nadu) తీరంలో భారత భద్రతాసంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. టియర్ గ్యాస్ వంటివాటి తయారీలో ఉపయోగించే ఆ రసాయనాల ఎగుమతులపై అంతర్జాతీయంగా నిషేధం ఉందని అధికారులు తెలిపారు. డ్రాగన్‌ సాయంతో ప్రమాదకర రసాయన, జీవాయుధాల తయారీ కార్యక్రమాల్లో పాకిస్థాన్‌ (Pakistan) నిమగ్నమై ఉందని ఆరోపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్థాన్‌లోని ఓ రక్షణ ఉత్పత్తుల సరఫరాదారుకు ‘‘ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్’’ అనే రసాయనాన్ని చేరవేసేందుకు సిద్ధమైంది. 2560 కిలోల ఆ సరకును 103 డ్రమ్ముల్లో నింపి.. ఏప్రిల్ 18న షాంఘై నౌకాశ్రయంలో ఓ వాణిజ్య నౌకలో లోడ్ చేసింది. కరాచీకి బయల్దేరిన ఆ నౌక.. మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్ట్‌కు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఆ అనుమానాస్పద సరకును గుర్తించారు. నిపుణుల సాయంతో పరీక్షించగా.. నిషేధిత రసాయనంగా తేలడంతో స్వాధీనం చేసుకున్నారు. ‘వాస్సెనార్ అరేంజ్‌మెంట్‌’ కింద దీని ఎగుమతిపై ఆంక్షలు ఉన్నాయి.

చైనాను కుదిపేస్తున్న వంటనూనెల కుంభకోణం..!

ఈ ఏడాది మార్చిలోనూ చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్తోన్న ఓ నౌకను ముంబయి పోర్టులో భద్రతా ఏజెన్సీలు అడ్డుకున్నాయి. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా సమాచారంతో దానిని నిలిపివేశాయి. ఇదిలా ఉండగా.. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత, స్థిరత్వానికి దోహదపడేందుకు 1996లో ‘వాస్సెనార్ ఒప్పందం’ కుదిరింది. ఆయుధాలు, ద్వంద్వ వినియోగ సామగ్రి, సాంకేతికతల ఎగుమతుల్లో నియంత్రణ కోసం దానిని తీసుకువచ్చారు. ఇందులో భారత్‌ సహా 42 దేశాలకు భాగస్వామ్యం ఉంది. చైనా, పాక్‌లు దీనిపై సంతకం చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని