Earthquake: భారీ భూకంపం.. తుర్కియేకు భారత సహాయ బృందాలు!

తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, వైద్య బృందాలను పంపాలని భారత్‌ నిర్ణయించింది. తుర్కియే, సిరియాలు సోమవారం భారీ భూకంపంతో కకావికలమైన విషయం తెలిసిందే.

Updated : 06 Feb 2023 16:47 IST

దిల్లీ: భారీ భూకంపంతో తుర్కియే(Turkey), సిరియా(Syria)లు అల్లాడిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తుర్కియేలో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ దేశాలను ఆదుకునేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తామని భారత్‌ ప్రకటించింది. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని సూచనల మేరకు తుర్కియేలో తక్షణ సహాయక చర్యల నిర్వహణకు భారత్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) బృందాలతోపాటు వైద్యసిబ్బందిని, ఇతర అవసరమైన సామగ్రిని పంపుతోంది.

సహాయక చర్యలపై ప్రధాన మంత్రికి ప్రధాన సెక్రెటరీ డా.పీకే మిశ్ర సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపాలని నిర్ణయించారు. వైద్యబృందాలు, సహాయ సిబ్బందితోపాటు అవసరమైన మందులూ చేరవేయనున్నారు. తుర్కియే ప్రభుత్వం, అంకారాలోని భారత రాయబార కార్యాలయం, ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

అంతకుముందు భూకంప విలయంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు. ఇదిలా ఉండగా.. తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600కుపైగా పౌరులు మృతి చెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని