India-Canada: కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు సంతాపం.. ‘కనిష్క’తో భారత్‌ కౌంటర్

కెనడా పార్లమెంట్‌ వేదికగా ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ (Hardeep Singh Nijjar)కు సంతాపం ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. దానికి తగిన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 19 Jun 2024 14:18 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య జరిగి ఏడాదైన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో సంతాప కార్యక్రమం జరిగింది. దీనిపై భారత్‌ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. తనదైన శైలిలో ఘాటు సందేశం పంపింది. ఈమేరకు వాంకోవర్‌లోని రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా స్పందించింది.

‘‘ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో భారత్‌ ముందువరుసలో ఉంది. ఈ విషయంలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఎయిరిండియా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి జూన్‌ 23, 2024 నాటికి 39 సంవత్సరాలు. ఆ ఉగ్రవాదుల పిరికిపంద చర్యలో 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 86 మంది చిన్నారులు ఉన్నారు. పౌరవిమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన దుర్ఘటన అది. ఆ రోజున వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్‌ వద్ద సెపెర్లీ ప్లేగ్రౌండ్‌లో ఉన్న ఎయిరిండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావాన్ని తెలిపేందుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం’’ అంటూ దౌత్య కార్యాలయం పోస్టు పెట్టింది. 1985 నాటి ఎయిరిండియా ‘కనిష్క’ విమానం పేల్చివేత ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సిక్కు వేర్పాటువాదులు పెట్టిన బాంబుకి ఆ విమానం తునాతునకలైంది. 329 మంది మృతి చెందినా.. అన్ని మృతదేహాలు లభ్యం కాలేదు.

బిడ్డ కోసం.. ఆ తల్లి నిరీక్షణ!

కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు సంతాప కార్యక్రమం నిర్వహించినందుకు కౌంటర్‌గా భారత్‌ వైపు నుంచి ఈ ప్రకటన వచ్చింది. 2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య (Nijjar's killing) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ (India) ఖండించింది. ‘‘ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి’’ అంటూ ట్రూడో సర్కార్‌పై నెటిజన్లు మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు