S Jaishankar: లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన మీరా మాట్లాడేది..? పాక్‌పై జైశంకర్ ఘాటు విమర్శలు

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దీటుగా బదులిచ్చారు.

Updated : 15 Dec 2022 10:40 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ఐక్యరాజ్యసమితి (United Nations) భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన దాయాది పాకిస్థాన్‌ (Pakistan)కు భారత్‌ మరోసారి గట్టిగా బదులిచ్చింది. ఒసామా బిన్‌ లాడెన్‌ (Osama bin Laden) లాంటి భీకర ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన దేశానికి.. పొరుగు దేశ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన వారికి ఐరాస(UN) వంటి ప్రపంచ వేదికపై ‘సుద్దులు’ చెప్పే అర్హత లేదని స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌(S Jaishankar) పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని పరోక్షంగా చైనా(China), పాకిస్థాన్‌లపై ఘాటు విమర్శలు చేశారు.

ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ- సంస్కరణల’పై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న జైశంకర్‌.. దాయాదికి దీటుగా బదులిచ్చారు. ‘‘సమస్యలపై ఉత్తమ పరిష్కారం కోసం శోధిస్తున్నప్పుడు ఇలాంటి ముప్పులను(పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ) సాధారణంగా తీసుకోకూడదు. ప్రపంచం మొత్తం ఆమోదించని వాటిని సమర్థించాలనే ప్రశ్నే తలెత్తకూడదు. సీమాంతర ఉగ్రవాదాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఒసామా బిన్‌ లాడెన్‌ లాంటి ఉగ్రవాదికి ఆతిథ్యమిచ్చిన వారికి.. పొరుగుదేశ పార్లమెంట్‌పై దాడి చేసిన దేశానికి ఐరాసలో ఇతరులకు ప్రబోధించే అర్హత లేదు’’ అని జైశంకర్‌ గట్టిగా చెప్పారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయని పాక్‌, చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి ముప్పు, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం.. ఇలాంటి కీలక సవాళ్లపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తేనే ఐరాసపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు.

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్‌ మరోసారి అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని పాక్‌ ఇకనైనా అంగీకరించి.. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలంటూ హితవు పలికారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావు లేని వాతావరణంలో మాత్రమే తాము ఇస్లామాబాద్‌తో సంబంధాలను కోరుకుంటున్నామని ఐరాస వేదికగా భారత్‌ మరోసారి స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఐరాస భద్రతా మండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన బహుళ పాక్షిక సంస్కరణలపై చర్చించేందుకు జైశంకర్‌ మంగళవారం ఐరాస కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి అక్కడి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని