China-Pak: కశ్మీర్‌పై చైనా-పాక్‌ సంయుక్త ప్రకటన.. దీటుగా స్పందించిన భారత్‌

జమ్మూకశ్మీర్‌ అంశంపై చైనా-పాకిస్థాన్‌లు ఇటీవల చేసిన సంయుక్త ప్రకటనను భారత్‌ తిప్పికొట్టింది.

Published : 13 Jun 2024 23:23 IST

దిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి చైనా-పాకిస్థాన్‌లు చేసిన సంయుక్త ప్రకటనను భారత్‌ తిప్పికొట్టింది. వారిది అనవసర చర్యేనని స్పష్టంచేసింది. జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి ఉద్ఘాటించింది. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌, చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌లు జూన్‌ 7న జారీ చేసిన సంయుక్త ప్రకటనపై భారత్‌ ఇలా దీటుగా స్పందించింది.

‘‘కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ అంశాన్ని చైనా, పాకిస్థాన్‌ జూన్‌ 7నాటి సంయుక్త ప్రకటనలో ప్రస్తావించాయి. అటువంటి చర్యలను తిరస్కరిస్తున్నాం. ఆ అంశంపై మా వైఖరి సుస్పష్టం. ఆ విషయం వారికీ తెలుసు. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. భారత్‌తో విడదీయరానివి. ఈ విషయం గురించి వ్యాఖ్యానించే అధికారం మరే దేశానికి లేదు’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.

కువైట్‌ విషాదం.. మూడంతస్తుల పైనుంచి దూకి.. ప్రాణాలు రక్షించుకొని!

చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (CPEC) గురించి ప్రస్తావించిన ఆయన.. అందులో భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాలు పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్నాయన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తూ.. ఆక్రమించుకున్న భూభాగాలను చట్టబద్ధం చేసే ఏ దేశ ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. సుమారు 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఆ సీపెక్‌ ప్రాజెక్టును భారత్‌ గుర్తించని విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌.. ఇటీవల చైనాలో పర్యటించారు. ఈసందర్భంగా జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పాక్‌.. చైనాకు వివరించింది. దీనికి డ్రాగన్‌ బదులిస్తూ.. ఆ వివాదం ఎంతోకాలంగా మరుగునపడిపోయిందని పేర్కొంది. ఐరాస నిబంధనలు, భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇలా జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ఆ రెండు దేశాలు ప్రస్తావించడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని