India UK FTA: దీపావళి నాటికి బ్రిటన్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం: పీయూష్‌ గోయల్‌

భారత్‌-బ్రిటన్‌ మధ్య దీపావళీ నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

Published : 27 May 2022 20:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-బ్రిటన్‌ మధ్య దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ఇప్పటికే దీనిపై రెండు బృందాలు చర్చలు జరుపుతున్నాయని ఆయన వివరించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన చేపట్టిన యూకే పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్‌ 13వ తేదీన ఇరుపక్షాలు మరోసారి చర్చలు జరపనున్నాయి.

ఇండియన్‌ గ్లోబల్‌ ఫోరమ్‌ జూన్‌ 27 నుంచి నిర్వహించే వార్షిక భారత్‌-యూకే ప్రారంభ కార్యక్రమంలో గోయల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, యూఏఈతో ఎఫ్‌టీఏలను వేగంగా చేసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. కెనడాతో కూడా ఇటువంటి ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో ఎర్లీ హార్వెస్ట్‌ ఒప్పందం జరిగే అవకాశం ఉందన్నారు. తొలుత ఇరు దేశాల వాణిజ్య బంధాల్లోని సులువైన ఫలాలను అందుకొని.. ఆ తర్వాతి దశల్లో కఠిన అంశాలపై దృష్టిపెడతామన్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. యూకేతో జరుగుతున్న చర్చలను చూస్తే.. దీపావళి నాటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉందన్నారు.

గత నెలలో బ్రిటన్‌ ప్రధాని భారత్‌ పర్యటించిన సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. అక్టోబర్‌ నాటికి డ్రాఫ్ట్‌ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ డ్రాఫ్ట్‌ సిద్ధం అయ్యాక ప్రధాని మోదీని సంతకాల కార్యక్రమానికి రావాల్సిందిగా భారత కమిషనర్‌ గాయిత్రి ఇస్సార్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని