Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పదవి..!

అమెరికా వైమానిక దళంలో మన తెలుగు వ్యక్తి రాజా చారి (Raja Chari)కి కీలక పదవి దక్కనుంది. అతడిని బ్రిగేడియర్‌ జనరల్‌గా జో బైడెన్‌ నామినేట్‌ చేశారు.

Updated : 27 Jan 2023 15:55 IST

వాషింగ్టన్‌: భారత అమెరికన్‌, తెలుగు వ్యక్తి రాజాచారి (Raja Chari) అగ్రరాజ్యంలో మరో అరుదైన ఘనత అందుకోబోతున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ (US Airforce)లో బ్రిగేడియర్‌ జనరల్‌ గ్రేడ్‌ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) నామినేట్‌ చేశారు. ఈ మేరకు యూఎస్‌ రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది.

అమెరికా (America) ఎయిర్‌పోర్స్‌లో బ్రిగేడియర్‌ జనరల్‌ అనేది వన్‌ స్టార్‌ జనరల్ ఆఫీసర్‌ ర్యాంక్‌ హోదా. దీని తర్వాత మేజర్‌ జనరల్‌ హోదా దక్కుతుంది. 45 ఏళ్ల రాజా చారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కల్నల్‌ హోదాలో ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అంతరిక్ష యానం కూడా పూర్తి చేసుకున్నారు.

ఎవరీ రాజాచారి..

రాజాచారి (Raja Chari) తండ్రి శ్రీనివాస్‌ వి.చారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా దేశస్థురాలైన పెగ్గీ ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజాచారి 1977లో జన్మించారు. రాజా.. స్కాన్సిన్‌లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్‌, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. యూఎస్‌ నావల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లోనూ విద్యనభ్యసించారు. 2017లో నాసా (NASA) ఆస్ట్రోనాట్‌ క్యాండిడేట్‌ క్లాస్‌కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్‌లో రాజాచారి ఓ సభ్యుడు. ఫాల్కన్‌ 9 రాకెట్‌లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) బయల్దేరగా.. ఈ మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరించడం విశేషం. కొన్ని నెలల పాటు ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు పూర్తి చేసుకుని గతేడాది మే నెలలో భూమిపైకి తిరిగొచ్చింది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం.

ఇదిలా ఉండగా.. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్‌’ మిషన్‌ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు