Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో.. భారత సంతతి సంపన్నుడు..!

మరో భారత సంతతి నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచారు. ఆయన రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ పడనున్నారు. 

Updated : 22 Feb 2023 17:05 IST

వాషింగ్టన్‌: అమెరికా(America) అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన మరో రిపబ్లికన్‌ నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన పోటీ గురించి అధికారికంగా వెల్లడించారు. నిక్కీ హేలీ(Nikki Haley) తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారత సంతతి నేత ఈయనే. ఆమె కూడా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వారే.

‘అమెరికా(America) ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రకటన చేయడం పట్ల గర్వంగా ఉంది. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం ఇది. నేను అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే.. దానికంటే ముందు అమెరికా అంటే ఏంటో తిరిగి కనుక్కోవాలి. అలాగే చైనా(China) నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను’ అని వెల్లడించారు. 

వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్‌, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్‌ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్‌ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు