Britain: బ్రిటన్‌లో జగన్నాథుడికి తొలి ఆలయం.. రూ.250 కోట్ల విరాళం

బ్రిటన్‌లో (Britain) నిర్మిస్తున్న తొలి జగన్నాథ ఆలయ (Jagannadha Swami Temple) నిర్మాణానికి ఒడిశాకు చెందిన ఎన్నారై బిశ్వనాథ్‌ పట్నాయక్‌ రూ.250కోట్లు విరాళం ఇచ్చారు.

Updated : 25 Apr 2023 23:54 IST

లండన్‌: బ్రిటన్‌లో (Britain) తొలి జగన్నాథస్వామి ఆలయ (Jagannadha Swami temple) నిర్మాణానికి ఒడిశాకు (odisha) చెందిన ఎన్నారై రూ.250 కోట్లు విరాళంగా ఇచ్చారు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి అని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. భూరి విరాళం సమర్పించిన బిశ్వనాథ్‌ పట్నాయక్‌ వృత్తి రీత్యా యూకేలో స్థిరపడ్డారు. లండన్ శివారులో జగన్నాథ స్వామి ఆలయం నిర్మించేందుకు అక్కడి స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్‌జేఎస్‌యూకే) పేరిట ఓ  సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సొసైటీ విరాళాలు సేకరిస్తోంది. ఇటీవల అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించిన సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి బిశ్వనాథ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన రూ.250కోట్ల విరాళం ప్రకటించారు. 

బిశ్వనాథ్‌ బ్రిటన్‌లో పెట్టుబడుల సంస్థ ఫిన్‌నెస్ట్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఆయనే ఆ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 15 ఏకరాల్లో ఈ ఆలయం నిర్మించనున్నారు. 2024 చివరి నాటికి తొలివిడత నిర్మాణ పనులు పూర్తి చేయాలనే యోచనలో ఎస్‌జేఎస్‌యూకే ఉంది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథస్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు యూరప్‌ దేశాల్లో జగన్నాథ స్వామి సంస్కృతికి ఈ ఆలయం కేంద్రంగా మారుతుందని ఎస్‌జేఎస్‌యూకే ఛైర్మన్ సహదేవ్‌ స్వైన్‌ తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని