Beijing Winter Olympics: ‘అగ్గి’రాజేసిన డ్రాగన్‌..!

గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణపై మరో ఉద్రిక్తతలు రాజుకొన్నాయి. మానసిక యుద్ధతంత్రాన్ని చైనా క్రీడల్లోకి కూడా చొప్పించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వివాదం మరో దశకు చేరింది. భారత్‌ను కవ్వించి

Updated : 04 Feb 2022 12:04 IST

భారత్‌ దౌత్యబహిష్కరణకు దారి తీసిన టార్చ్‌బేరర్‌ వివాదం 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

గల్వాన్‌ లోయలో భారత్‌ - చైనా ఘర్షణపై మరోసారి ఉద్రిక్తతలు రాజుకొన్నాయి. మానసిక యుద్ధతంత్రాన్ని చైనా క్రీడల్లోకి కూడా చొప్పించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వివాదం మరో దశకు చేరింది. భారత్‌ను కవ్వించి బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్య బహిష్కరణ చేసేలా చైనా చేసింది. వాస్తవానికి  దౌత్య బహిష్కరణ అంశం భారత్‌ మదిలో లేదన్న విషయం గత పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. కానీ, భారత్‌కు అవమానకర పరిస్థితులు కల్పించడంతో.. దౌత్య బహిష్కరణ చేయాల్సిన స్థితి తలెత్తింది.

భారత్‌ సానుకూల దృక్పథంతో ఉన్నా..

ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక దేశాలు బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను చాలా ముందుగానే దౌత్య బహిష్కరణ చేశాయి.  కానీ, భారత్‌ మాత్రం సరిహద్దు వివాదం జరుగుతున్నా.. చాలా ఓర్పుగా వ్యవహరించింది. బ్రిక్స్‌, షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో), ఆర్‌ఐసీ వంటి కూటముల్లో చైనాతో పాటు భారత్‌ భాగస్వామి. ఈ నేపథ్యంలో పొరుగుదేశంతో దౌత్యసంబంధాలు మరింత పతనం కాకూడదనే ఉద్దేశంతో భారత్‌ వ్యహరించింది. చాలా దౌత్యవేదికలను చైనాతో కలిసి పంచుకొంది. 2021 నవంబర్‌లో జరిగిన ఆర్‌ఐసీ (రష్యా-ఇండియా-చైనా) వర్చువల్‌ భేటీలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాల్గొని బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌-2022కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశారు. 

కావాలని రెచ్చగొట్టిన చైనా..

వింటర్‌ ఒలిపింక్స్‌ చుట్టూ అప్పటికే ముసురుకొన్న రాజకీయాల్లో భాగస్వామి కాకూడదని భారత్‌ ఇలా చేసింది. మరో పక్క వింటర్‌ ఒలిపింక్స్‌ను అమెరికా నేతృత్వంలో పలు పశ్చిమ దేశాలు దౌత్య బహిష్కరణ చేశాయి. వీటిలో జపాన్‌, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, లాత్వియా, లిథువేనియా, డెన్మార్క్‌, ది నెదర్లాండ్స్‌, స్వీడన్‌, చెక్‌ రిపబ్లిక్‌, కొసావో, బెల్జియం, ఎస్తోనియా వంటి దేశాలున్నాయి. ఇలాంటి సమయంలోనే.. వింటర్‌ ఒలింపిక్స్‌కు రెండ్రోజుల ముందు టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ దాడిలో పాల్గొన్న సైనిక కర్నల్‌ క్వీ ఫాబోవాను ఎంపిక చేసినట్లు చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. 1200 మంది టార్చ్‌ బేరర్లలో అతడు కూడా ఒకడు. బుధవారం క్వీ ఫాబోవాకు చైనా స్పీడ్‌ స్కేటింగ్‌ స్టార్‌ వాంగ్‌ మెంగ్‌ ఒలింపిక్‌ జ్యోతిని అందించిన దృశ్యాలను చైనా టీవీలో ప్రసారం చేశారు. అతడికి సైనిక వందనం కూడా సమర్పించారు. ప్రపంచ దేశాలు బీజింగ్‌ వైపు చూస్తున్న సమయంలో భారత్‌కు ఇది ఇబ్బందికర పరిస్థితి. దీంతో చైనా తీరుకు తగిన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకొని వింటర్‌ ఒలింపిక్స్‌ దౌత్య బహిష్కరణను ప్రకటించింది. ఈ ఒలింపిక్స్‌ను భారత్‌లోని దూరదర్శన్‌లో కూడా ప్రసారం చేయకూడదని నిర్ణయించుకొంది. భారత్‌ చరిత్రలో ఒక ఒలింపిక్స్‌ను నిరసిస్తూ దౌత్య బహిష్కరణ చేయడం ఇదే తొలిసారి.

గల్వాన్‌ రాళ్లను బహూకరిస్తూ..

చైనా కొన్నాళ్లుగా గల్వాన్‌పై దేశీయంగా ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 2022 నూతన సంవత్సర ప్రారంభ సమయంలో గల్వాన్‌లోని చైనా స్థావరం వద్ద ఓ వీడియోను చిత్రీకరించింది. దీనిలో పీఎల్‌ఏ సైనికులు చైనా పతాకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఉంది. ఇది తియనాన్మన్‌ స్క్వేర్‌పై ఎగరేసిన పతాకమని పేర్కొంటూ గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. వాస్తవానికి ఈ చిత్రీకరణ జరిగింది గల్వాన్‌ ఘర్షణ జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న చైనా స్థావరంలో అని తర్వాత తేలింది. 

ఆ తర్వాత జనవరి 7వ తేదీన పీఎల్‌ఏ పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ చైనా సోషల్‌ మీడియా వేదిక విబోలో ఒక ఖాతా తెరిచింది. దీనిలో గల్వాన్‌ ఫొటోతో కూడిన ఓ నోటీస్‌ను పోస్టు చేసింది. దీనిని రీపోస్టు చేసిన 10 మంది నెటిజన్లను ఎంపిక చేసి గల్వాన్‌ నుంచి తీసుకొచ్చి రాళ్లను బహూకరిస్తామని ప్రకటించింది. ఈ రాళ్ల బహూకరణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొదలు పెడతామని పేర్కొంది. దీనిపై గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది.

గల్వాన్‌ ఘర్షణలో భారీ సంఖ్యలో చైనా సైనికులు మరణించినట్లు అమెరికా మీడియా, రష్యా మీడియా, తాజాగా ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘర్షణతో చైనా సాధించింది ఏమీలేదు. ఈ క్రమంలో దేశీయంగా పరువు కాపాడుకోవడానికి గల్వాన్‌లో ఏదో భారీ విజయం సాధించినట్లు భ్రమలు సృష్టించేలా ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌ బేరర్‌గా కర్నల్‌ క్వీ ఫాబోవాను తీసుకొచ్చింది. భారత్‌ దౌత్య బహిష్కరణపై చైనా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కానీ, డిసెంబర్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌ను పశ్చిమ దేశాలు కొన్ని దౌత్య బహిష్కరణ చేసిన సమయంలో మాత్రం ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. ‘మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య సంబంధాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని