ఉద్యోగం కోసం భారత్‌ నుంచి కెనడాకు.. మెటాలో చేరిన రెండు రోజులకే లే ఆఫ్‌..!

ఫేస్‌బుక్‌లో భారీ ఉద్యోగాల కోత ఓ భారతీయ వ్యక్తిపై పడింది. ఈ తొలగింపుల వల్ల తనకు ఎదురైన పరిస్థితిని లింక్డిన్‌ ఖాతాలో షేర్ చేశారు. 

Updated : 11 Nov 2022 09:26 IST

న్యూయార్క్‌: సామాజిక మాద్యమ దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగం కోల్పోయిన భారత వ్యక్తి హిమాన్షు( Himanshu V) పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడు సంస్థలో చేరిన రెండురోజులకే నిరుద్యోగిగా మారారు. అలాగే ఈ ఉద్యోగం కోసమే అతడు భారత్‌ నుంచి కెనడాకు షిఫ్ట్‌ అయ్యారు. 

‘నేను మెటాలో చేరేందుకు కెనడాకు మకాం మార్చాను. చేరిన రెండు రోజులకే నా ప్రయాణం ముగిసింది. మెటా భారీ తొలగింపు ఎఫెక్ట్ నాపై పడింది. ఉద్యోగం కోల్పోవడంతో ఇబ్బంది పడుతున్నవారి గురించే నా ఆలోచనంతా. నిజం చెప్తున్నా.. తర్వాత ఏంటి అనే దానిపై నాకు ఎలాంటి ఐడియా లేదు. కెనడా లేక ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నియామకాల గురించి ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయండి’ అని హిమాన్షు తన లింక్డిన్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. 

అతడి లింక్డిన్‌ ఖాతా ప్రకారం.. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అడోబ్‌, ఫ్లిప్‌కార్ట్‌, గిట్‌హబ్‌ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు అతడికి ఓదార్పు మాటలు చెప్పారు. మరికొందరు ఉద్యోగావకాశాల గురించి వెల్లడించారు. తొలగింపుల జాబితా ముందుగానే సిద్ధంగా ఉంటుంది కదా.. ఇలాంటి పరిణామం కాస్త ఆశ్చర్యంగానే ఉందని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని