Taliban: అఫ్గాన్‌లో భారత బృందం.. తాలిబన్లతో తొలిసారి భేటీ

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లతో భారత బృందం తొలిసారి భేటీ అయ్యింది.

Published : 03 Jun 2022 01:50 IST

తమతో వాణిజ్యం మొదలుపెట్టండని కోరిన తాలిబన్లు

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లతో భారత బృందం తొలిసారి భేటీ అయ్యింది. ఈ సందర్భంగా అఫ్గాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలపై చర్చించిన భారత విదేశాంగశాఖ బృందం.. అక్కడి ప్రజలకు అందిస్తున్న మానవతా సాయంపై చర్చించింది. ఇదే సమయంలో అఫ్గాన్‌లో భారత్‌ చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి పునఃప్రారంభించడం, దౌత్యపరమైన కార్యకలాపాలను తిరిగి కొనసాగించడంతోపాటు అఫ్గాన్‌ విద్యార్థులు, రోగులకు దౌత్యపరమైన సేవలను అందించాలని తాలిబన్‌ ప్రతినిధులు కోరారు. అంతేకాకుండా తమతో భారత్‌ వాణిజ్యం కొనసాగించే విషయాన్ని కూడా పరిశీలించాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. ఇక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను భారత్‌ అధికారికంగా గుర్తించని విషయం తెలిసిందే.

‘గతేడాది ఆగస్టు 15 తర్వాత అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు క్షీణించిన దృష్ట్యా భారత అధికారులందరినీ అక్కడ నుంచి స్వదేశానికి రప్పించాం. అయినప్పటికీ అక్కడున్న స్థానిక సిబ్బంది రాయబార కార్యాలయ ప్రాంగణ నిర్వహణను చూసుకున్నారు’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. ఆ దీర్ఘకాల బంధాలు తమ విధానాన్ని కొనసాగించేందుకు దోహదపడుతాయన్నారు. ఈ క్రమంలోనే తాలిబన్ల సీనియర్‌ నాయకులతో భారత బృందం భేటీ అయ్యిందని.. అఫ్గాన్‌ ప్రజలకు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని అందించడంపై చర్చించిందని అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు.

అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌ నుంచి భారత రాయబార కార్యాలయ బృందం స్వదేశానికి తరలివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అఫ్గాన్‌లోని చాలా ప్రాంతాల్లో భారత్‌ చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలను పరిశీలించేందుకు భారత బృందం ప్రయత్నిస్తోందని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు