న్యూజిలాండ్‌ యూత్‌ పార్లమెంట్‌ మెంబర్‌గా తెలుగమ్మాయి మేఘన

ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా

Updated : 18 Jan 2022 14:49 IST

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎంపిక  

టంగుటూరు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక నేపథ్యంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా ‘వాల్కటో’ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు.

మేఘన తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ ఉన్నత పాఠశాలలో స్కూలింగ్‌ పూర్తి చేశారు. న్యూజిలాండ్‌కు వలస వచ్చిన పలు దేశాల శరణార్థులకు కనీస వసతులు, విద్య, ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. దీంతో ఆమెను పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గత డిసెంబర్‌ 16న జరిగిన ఈ ఎంపిక విషయాన్ని ఆ ప్రాంత ప్రభుత్వ ఎంపీ టిమ్‌ నాన్‌ డిమోలెన్‌.. మేఘన కుటుంబసభ్యులకు తెలిపారు. ఫిబ్రవరిలో ఆమె ప్రమాణ స్వీకారం ఉంటుందని సంక్రాంతికి స్వగ్రామం వచ్చిన కుటుంబసభ్యులు తెలిపారు. ‘‘న్యూజిలాండ్‌ దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా’’ అని మేఘన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని