యూకే పార్లమెంట్‌లో.. భగవద్గీతపై భారత సంతతి ఎంపీ ప్రమాణం

ఇటీవల యూకే ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి నేత శివాని రాజా(British MP Shivani Raja).. భగవద్గీతపై ప్రమాణం చేశారు. 

Published : 11 Jul 2024 10:44 IST

లండన్‌: ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంట్‌ దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివాని రాజా (British MP Shivani Raja) ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు వెల్లడించారు.

లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివాని విజయం సాధించారు. ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. 37 సంవత్సరాలుగా ఆ స్థానం లేబర్‌ పార్టీకి కంచుకోట. ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతి నేత రాజేశ్‌ అగర్వాల్‌ను ఓడించి, ఆ కోటను ఈ కన్జర్వేటివ్‌ నేత బద్దలు కొట్టారు. ఈక్రమంలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేశారు. ‘‘లైసెస్టర్‌ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంట్‌లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా ఉంటానని గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్‌ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 చోట్ల విజయం సాధించారు. దాంతో రిషి సునాక్‌ అధికారాన్ని కోల్పోయారు. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని