USA: అమెరికాలో భారత మూలాలున్న విద్యార్థి హత్య.. సహవిద్యార్థిపైనే అనుమానాలు

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ మూలాలున్నఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడి సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Updated : 06 Oct 2022 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ మూలాలున్నఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడి సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వరుణ్‌ మనీష్‌ చడ్డా అనే విద్యార్థి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో డేటాసైన్స్‌ విభాగంలో చదువుతున్నాడు. అతడు విశ్వవిద్యాలయంలో మెక్‌కట్చెన్‌ హాల్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడవటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి అతడి రూమ్‌మేట్‌  జి మిన్‌ (జిమ్మిషా)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడిది దక్షిణ కొరియా. అతడు సైబర్‌ సెక్యూరిటీ మేజర్‌, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌.  చడ్డా మృతి గురించి షానే అర్ధరాత్రి 12.45 సమయంలో 911కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. పోలీసులు ఈ కాల్‌ వివరాలను బహిర్గతం చేయలేదు. కాకపోతే చడ్డాపై అకారణంగా దాడి జరిగినట్లు మాత్రం పర్డ్యూ విశ్వవిద్యాలయం పోలీస్‌ చీఫ్‌ వెల్లడించారు. కాల్‌ వచ్చిన వెంటనే తొలుత జిమ్మిషాను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన హత్య ఇదే. ఈ హత్యపై విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మిచ్‌ డేనియల్స్‌ విచారం వ్యక్తం చేశారు.  చడ్డా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు మొత్తం ఒక చోట సమావేశమై చడ్డాకు నివాళి అర్పించారు. 

చడ్డా హత్యపై అతడి స్నేహితడు అర్నబ్‌ సిన్హా మాట్లాడుతూ.. ‘‘మంగళవారం రాత్రి చడ్డా మిత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో హఠాత్తుగా అతడి కేక వినిపించింది. కాకపోతే అక్కడేమి జరిగిందో తెలియలేదు.  మర్నాడు నిద్రలేచే సరికి చడ్డా మరణవార్త తెలిసింది’’ అని పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని