Nepal: ఫేస్‌బుక్‌ లైవ్‌లో.. నేపాల్‌ విమానం కూలిన దృశ్యాలు

నేపాల్‌ విమానం కూలుతున్న సమయంలో అందులో ఓ ప్రయాణికుడు ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉన్నాడు. విమానం కూలిన భయానక దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.

Updated : 16 Jan 2023 11:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌ (Nepal)లో ఆదివారం చోటుచేసుకున్న విమాన దుర్ఘటన (Plane Crash)కు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. రాజధాని కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌ (Yeti Airlines) విమానం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భీకర ప్రమాద దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో రికార్డయ్యాయి.

ఈ విమానంలో ఐదుగురు భారతీయులున్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరైన సోను జైస్వాల్‌.. విమానంలో కిటికీ పక్కన కూర్చుని తన ఫోన్లో ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ (Live Streaming) చేసి గాల్లో నుంచి సిటీ అందాలను చూపించారు. సరిగ్గా అదే సమయంలో విమానం కుప్పకూలింది. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. అవన్నీ లైవ్‌ స్ట్రీమింగ్‌లో రికార్డయ్యాయి. అప్పటిదాకా ప్రకృతి అందాలను చూస్తూ చిరునవ్వులు చిందించిన ప్రయాణికులు.. విమానం కూలిపోవడంతో హాహాకారాలు చేయడం ఆ వీడియోలో రికార్డయ్యింది. సోను జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో కన్పించిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ విమానం కూలడానికి (Plane Crash) ముందు గాల్లో నియంత్రణ కోల్పోయిన దృశ్యాలు బయటికొచ్చిన విషయం తెలిసిందే.

ఒక్క ప్రాణమూ మిగల్లేదు..

యతి ఎయిర్‌లైన్స్‌ (Yeti Airlines)కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని ఫొఖారాకు బయల్దేరిన 20 నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు మాత్రమే. అంటే మరో 5 నిమిషాల్లో విమానం గమ్యం చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులు సహా 10 మంది విదేశీయులు. ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని నేపాల్‌ (Nepal) ఆర్మీ సోమవారం వెల్లడించింది. ‘‘ప్రమాద స్థలం నుంచి ఏ ఒక్కరినీ ప్రాణాలతో కాపాడలేదు’’ అని నేపాల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్‌ భండారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలం నుంచి ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని