Italy: చేయి తెగినా వదిలేసి.. : ఇటలీ ప్రమాదంలో భారతీయుడి దుర్మరణం

ఇటలీలో జరిగిన ఓ ప్రమాదంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. 

Published : 20 Jun 2024 11:14 IST

రోమ్‌: పొట్టకూటి కోసం ఇటలీ (Italy) వెళ్లి పని చేసుకుంటున్న ఓ భారతీయుడు (Indian farm labourer) అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుమించిన క్రూరత్వం ఉండదంటూ అక్కడి నేతలు మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

భారత్‌కు చెందిన సత్నామ్‌ సింగ్‌(31) ఎలాంటి అధికారిక ధ్రువపత్రాలు లేకుండా ఇటలీలోని లాటినాలో నివసించేవారు. ఆ ప్రాంతంలో భారత్ నుంచి వలసవచ్చిన ఎంతోమంది కార్మికులు జీవిస్తుంటారు. అక్కడికి దగ్గర్లోని వ్యవసాయ క్షేత్రంలో సింగ్ పని చేసేవాడు. సోమవారం ఎండుగడ్డిని కత్తిరిస్తున్న సమయంలో అతడి చేయి తెగింది. వెంటనే అక్కడి సిబ్బంది అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిపోయి.. ఒక చెత్తబస్తాను పడేసినట్టుగా ఇంటిదగ్గర వదిలేశారని స్థానిక ట్రేడ్ యూనియన్ ఆరోపించింది. తర్వాత బాధితుడి భార్య, స్నేహితులు పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించడంతో.. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల కారణంగా అతడు బుధవారం ప్రాణాలు కోల్పోయాడని లాటినా ప్రాంత పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఇటలీ కార్మికశాఖ మంత్రి స్పందించారు. ఇది అత్యంత క్రూరమైన చర్య అంటూ ఖండించారు. దీనిపై విచారణ జరుగుతోందని, బాధ్యులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చారు. శ్రమ దోపిడీకి మారుపేరైన ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను నాగరికతకు ఓటమిగా అక్కడి విపక్ష నేతలు అభివర్ణించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ఇటలీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఆ కుటుంబానికి సహకరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని