England: ఇంగ్లండ్‌ ప్రవాసుల్లో.. భారతీయులే అత్యధికం

ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తాజా నివేదిక వెల్లడించింది. అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం మంది భారతీయులేనని తెలిపింది.

Published : 09 Nov 2022 01:09 IST

లండన్‌: విదేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోనూ భారతీయుల జనాభా పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం మనవారేనని తెలిపింది. ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తాజా నివేదిక వెల్లడించింది.

బ్రిటన్‌ జాతీయ గణాంక కార్యాలయ (ఓఎన్‌ఎస్‌) నివేదిక-2021 ప్రకారం, ఇంగ్లండ్‌, వేల్స్‌లో నివసిస్తోన్న వారిలో బ్రిటన్‌ బయట జన్మించిన వారి సంఖ్య 2011లో 75లక్షలుగా ఉంది. 2021 నాటికి అది కోటికి చేరుకుంది. గడిచిన పదేళ్లలో వీరి సంఖ్య 25లక్షలు (13శాతం నుంచి 16శాతానికి) పెరిగింది. ఈ జాబితాలో భారత మొదటి స్థానంలో ఉంది. గతేడాది అక్కడ నివాసమున్న వారిలో 9,20,000 మంది భారతీయులుండగా.. తర్వాతి స్థానంలో పోలండ్‌ (7,43,000), పాకిస్థాన్‌ (6,24,000)లు ఉన్నట్లు ఓఎన్‌ఎస్‌ వెల్లడించింది. 2011లో భారతీయుల సంఖ్య 6,94,000గా ఉంది.

లండన్‌లో నివసించే వారిలో ప్రతి పది మందిలో నలుగురు (40శాతం) బ్రిటన్‌ బయట జన్మించినవారే కావడం విశేషం. అయితే, గడిచిన పదేళ్లలో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5లక్షల 39వేలకు చేరింది. రొమేనియా నుంచి పనికోసం వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేసిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. వీటితోపాటు ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా నుంచి వలసలు పెరగగా.. అమెరికా, జమైకా నుంచి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా విదేశాల నుంచి బ్రిటన్‌కు వలసలు ఏవిధంగా ఉన్నాయనే విషయం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని సెన్సస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జోన్‌ వ్రాత్‌స్మిత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని