UN: పాక్‌.. ముందు ఇల్లు చక్కదిద్దుకో: ఐరాస వేదికగా భారత్‌ చురకలు

జమ్మూకశ్మీర్ అంశం గురించి స్పందించి ప్రతిసారి పాకిస్థాన్‌(Pakistan).. భారత్ ఆగ్రహానికి గురవుతూనే ఉంటుంది. అయినా సరే తన వైఖరిని మాత్రం మార్చుకోదు.

Published : 09 Mar 2023 18:33 IST

న్యూయార్క్: పొరుగువారిపై నిందలు వేసే ముందు తమ ఇంటిని తాము చక్కదిద్దుకోవాలని పాకిస్థాన్‌(Pakistan)ను ఉద్దేశించి భారత్ తీవ్రంగా స్పందించింది. ఐరాస(United Nations) వేదికగా దాయాది దేశానికి చురకలు అంటించింది. భారత్‌ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పాక్‌ చేసిన ఆరోపణలనుద్దేశించి ఈ మేరకు స్పందించింది. 

‘పాకిస్థాన్‌(Pakistan) తన దేశం గురించి పట్టించుకోకుండా ఏది తప్పు..? ఏది ఒప్పు..? అని ప్రపంచానికి నీతులు చెప్పే పనిలో ఉంది. ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలనేదీ మా సూచన. అలాగే సొంత ప్రజల మానవ హక్కుల పరిరక్షణలో దారుణమైన రికార్డును మెరుగుపరుచుకోవాలి’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జగ్‌ప్రీత్‌ కౌర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ.. జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆక్రమిత ప్రాంతం అనే పదం వాడారు. దీనిని భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

ఐరాస (UN)కు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) ఘాటుగా స్పందించారు. ‘ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుపుతున్నాం.ఈ సమయంలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధులు చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే’ అని ఆమె మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని