Indonesia: రెండున్నరేళ్లకుపైగా కరోనా ఆంక్షలు.. ఎట్టకేలకు పూర్తిస్థాయిలో ఎత్తివేత!

జనాభాపరంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశమైన ఇండోనేసియా.. తాజాగా కరోనా ఆంక్షలను పూర్తిస్థాయిలో ఎత్తేసింది. శుక్రవారం నుంచే ఈ మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది.

Updated : 30 Dec 2022 22:36 IST

జకర్తా: చైనా(China), జపాన్‌ తదితర దేశాలు కొవిడ్ ఆంక్షలు సడలించిన వేళ.. జనాభాపరంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశమైన ఇండోనేసియా(Indonesia) సైతం పూర్తి స్థాయిలో కొవిడ్‌ నిబంధనలను తొలగించింది. తొలి కేసు నమోదైన దాదాపు 32 నెలల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, సినిమా హాళ్లు ఇతరత్రా ఇండోర్‌ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిని ఎత్తేయడంతో పాటు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ చూపాలనే నిబంధనను తొలగించింది. దీంతో స్థానికంగా కొవిడ్‌ ఆంక్షల(Covid Restrictions)కు పూర్తిగా తెరదించినట్లయింది. ఈ మార్పులను శుక్రవారం నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. దేశ జనాభాలో దాదాపు అందరికీ రోగనిరోధక శక్తి పెంపొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడోడో(Joko Widodo) చెప్పారు.

జకర్తాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఒకప్పుడు మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమయ్యాం. కానీ, వరుసగా గత 10- 11 నెలల్లో ఎటువంటి కరోనా వేవ్‌ నమోదు కాని దేశాల జాబితాలో నిలిచాం’ అని విడోడో తెలిపారు. ఆంక్షల ఎత్తివేత.. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, శాస్త్రీయ ఆధారాలపైనే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చైనాలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతిపై స్పందిస్తూ.. తాము మాత్రం విదేశీ ప్రయాణాలపై కొత్తగా ఎటువంటి ఆంక్షలు విధించబోమని తెలిపారు. అయితే, దేశ ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు.. స్థానికంగా కేసులు మళ్లీ పెరిగితే.. ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చని హోంశాఖ మంత్రి టిటో కర్నావియన్ హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ సమయంలో.. ఇండోనేసియా కూడా వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా నిలిచింది! తొలి కేసు నమోదైన నెల రోజుల అనంతరం.. 2020 ఏప్రిల్‌లో మొదటిసారి ఆంక్షలు ప్రవేశపెట్టింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించకుండా.. ఆయా విధానాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డెల్టా ధాటికి.. 2021 జులైలో రోజుకు 56 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒమిక్రాన్‌ కారణంగా రోజుకు 64 వేలకు పైగా కేసులు వచ్చాయి. ప్రస్తుతం 500కుపైగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. 27 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో ఇప్పటివరకు అధికారికంగా 67 లక్షలమందికి వైరస్ సోకింది. 1,60,583 మరణాలతో ఆసియాలో రెండో స్థానం, ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా ఆంక్షలను ఎత్తేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని