Indonesia: ఇండోనేసియా భూకంపం.. 252కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

Published : 22 Nov 2022 18:29 IST

జకార్తా: ఇండోనేసియాలో అత్యధిక జనాభా కలిగిన జావా ద్వీపంలో భూకంపం సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 252 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. భవన శిథిలాల కింద నేడు మరిన్ని మృతదేహాలను గుర్తించారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. 600 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

రాజధాని జకార్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చియాంజుర్‌ కేంద్రంగా 5.6 తీవ్రతతో సోమవారం ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు చియాంజుర్‌ ప్రాంతం తీవ్రంగా ధ్వంసమైంది. భవనాలు కూలిపోయి అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. క్షతగాత్రులతో స్థానిక ఆసుపత్రిలన్నీ నిండిపోయాయి. దీంతో చాలా మందికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. ఈ విపత్తుతో చియాంజుర్‌ ప్రాంతంలో 13వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాన్ని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం పరిశీలించారు.

మోదీ దిగ్భ్రాంతి..

ఇండోనేసియా భూకంప ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండోనేసియాకు భారత్‌ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఇండోనేసియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ దేశం ‘రింగ్‌ ఆఫ్‌ పసిఫిక్‌ ఫైర్‌’లో ఉంది. ఇక్కడ సముద్రం అడుగున చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి. దీంతో ఇవి బద్ధలైనప్పుడు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ  ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది చనిపోయారు. 460 మంది గాయపడ్డారు. గత ఏడాది జనవరిలో సులావేసిలో భూకంప ధాటికి 100మందికి పైగా చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని