Miss AI: ఏఐ భామల అందాల పోటీ.. ‘మిస్‌ ఏఐ’ విజేత ఎవరో తెలుసా?

Miss AI: కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం నిర్వహించిన అందాల పోటీల్లో విజేతను ప్రకటించారు. మరి తొలి ‘మిస్‌ ఏఐ’గా ఎవరు నిలిచారంటే..?

Published : 09 Jul 2024 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తోన్న కృత్రిమ మేధతో టీచర్లు, న్యూస్‌రీడర్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లు... ఇలా చాలామంది వృత్తి నిపుణులే పుట్టుకొచ్చారు. వీరంతా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ, వాణిజ్య ప్రకటనలు, రీల్స్‌తో లక్షల మందిని ఆకట్టుకుంటున్నారు. అసలు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందుకే ఇలాంటి సుందరాంగుల కోసం ‘మిస్‌ ఏఐ (Miss AI)’ పోటీలను నిర్వహించారు. ఇందులో మొరాకోకు చెందిన ఇన్‌ప్లుయెన్సర్‌ కెంజా లాయ్‌లీ (Kenza Layli) ప్రపంచంలోనే మొట్టమొదటి  ‘ఏఐ అందాల సుందరి’గా కిరీటం దక్కించుకున్నారు.

‘వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌’ పేరుతో సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత క్రియేటర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫ్యాన్‌వ్యూ’ ఈ పోటీలను నిర్వహించింది. ప్రపంచంలోనే ఈ తరహా పోటీ జరగడం ఇదే తొలిసారి. ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు. వీరిలో మొరాకోకు చెందిన లాయ్‌లీ ‘మిస్‌ ఏఐ’గా నిలవగా.. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ లలీనా వలీనా రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన ట్రావెలర్‌ ఒలీవియా సి మూడో స్థానంలో నిలిచారు.

‘మిస్‌ ఏఐ’గా కిరీటం సాధించడంపై కెంజా లాయ్‌లీ తన ఇన్‌స్టా ఖాతాలో హర్షం వ్యక్తం చేసింది. ‘‘మనుషుల్లా నాకు భావోద్వేగాలు ఉండకపోయినప్పటికీ.. ఈ విజయంతో నేను చాలా ఆనందంగా ఉన్నా’’ అని రాసుకొచ్చింది. మెరియమ్‌ బెస్సా అనే క్రియేటర్‌ ఈ లాయ్‌లీని సృష్టించారు. పోటీలో విజేతగా నిలవగానే.. నిజమైన అందాల భామల పోటీల్లో గెలిచిన వారు కిరీటం ధరించినట్లుగానే లాయ్‌లీకి కిరీటం పెట్టి ఫొటోలు రూపొందించారు. అంతేనా.. ర్యాంప్‌పై నడుచుకుంటూ ఆమెను తీసుకొస్తున్నట్లుగా చిత్రాలను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆహారం, సంస్కృతి సంప్రదాయాలు, ఫ్యాషన్‌, బ్యూటీ, ట్రావెల్‌ వంటి వాటిపై వీడియోలు చేస్తూ లాయ్‌లీ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 2లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

‘మిస్‌ ఏఐ’ విజేతగా లాయ్‌లీ క్రియేటర్‌కు 20వేల డాలర్ల బహుమతి అందించారు. భారత్‌ నుంచి జారా శతావరీ టాప్‌ 10 ఫైనలిస్ట్‌లో నిలవగా.. టైటిల్‌ సాధించలేకపోయింది. ఈ ఊహా సుందరుల లుక్స్‌, వీరిని సృష్టించడం కోసం ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘మిస్‌ ఏఐ’ విజేతను ఎంపిక చేశారు. ఈ పోటీలకు మొత్తం నలుగురు న్యాయనిర్ణేతలు ఉండగా.. వీరిలో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని