HIV Treatment: హెచ్‌ఐవీ నుంచి పూర్తి రక్షణ!

హెచ్‌ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధాన్ని సాకారం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు.

Published : 08 Jul 2024 04:06 IST

క్లినికల్‌ ప్రయోగాల్లో 100 శాతం ఫలితాన్నిచ్చిన ఔషధం

కేప్‌ టౌన్‌: హెచ్‌ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధాన్ని సాకారం చేసే దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. లెనాకాపావిర్‌ అనే ఇంజెక్షన్‌ను ఏడాదికి రెండుసార్లు ఇస్తే యువతులకు ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా, ఉగాండాలో నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం మాత్రల రూపంలో ఇస్తున్న రెండు రకాల ఔషధాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తున్నట్లు తేలింది. 

హెచ్‌ఐవీ వైరస్‌లోని జన్యు పదార్థం, ఎంజైమ్‌లకు రక్షణ కల్పించే ఒక ప్రొటీన్‌ కవచాన్ని క్యాప్సైడ్‌ అంటారు. లెనాకాపావిర్‌ (లెన్‌ ఎల్‌ఏ).. ఫ్యూజన్‌ క్యాప్సైడ్‌ ఇన్‌హిబిటర్‌లా పనిచేస్తుంది. ప్రొటీన్‌ కవచాన్ని ఈ ఔషధం లక్ష్యంగా చేసుకుంటుంది. తాజా క్లినికల్‌ ప్రయోగంలో 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతులను ఎంపిక చేసుకున్నారు. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో యువతులే హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్లకు ఎక్కువ బాధితులవుతున్నారు. పరీక్షార్థులకు లెన్‌ ఎల్‌ఏ మందును ఆరునెలలకోసారి ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించారు. ఈ ప్రయోగంలో పలు అంశాలను పరిశీలించారు. ట్రువాడా, డెస్కోవీ అనే రెండు మాత్రలతో పోల్చినప్పుడు దీని సామర్థ్యాన్ని పరీక్షించారు. లెన్‌ ఎల్‌ఏ పొందిన 2,134 మంది మహిళల్లో ఒక్కరికి కూడా హెచ్‌ఐవీ సోకలేదని వెల్లడైంది. ట్రువాడా మాత్రలు వేసుకున్నవారిలో 1.5 శాతం మంది, డెస్కోవీ పొందిన వారిలో 1.8 శాతం మంది ఈ ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారని తేలింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల హెచ్‌ఐవీ కేసులు కొత్తగా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఈ వ్యాధి బారినపడకుండా కాపాడటానికి ఒక సమర్థ నివారణ సాధనంగా ఇది అక్కరకొస్తుందన్న భరోసా తాజా ప్రయోగం కల్పిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని