చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!

గత డిసెంబర్‌లో భారత్‌, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ జరగకుండా అమెరికా(America) ఇచ్చిన సమాచారం ఉపకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక కథనం వెలువడింది. 

Published : 22 Mar 2023 06:10 IST

వాషింగ్టన్: గత ఏడాది సరిహద్దుల్లో చైనా(China) చొరబాటు యత్నంపై భారత్‌ను అమెరికా(USA) ముందుగానే  అప్రమత్తం చేసిందా..? దానివల్లే ఆ దాడిని మనదేశం సమర్థవంతంగా ఎదుర్కొందా..? ఇప్పుడు ఇదే విషయంపై వెలువడిన కథనం గురించి శ్వేతసౌధ(White House) ప్రతినిధికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన ఏం చెప్పారంటే..?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌(Arunachal Pradesh's Tawang sector)లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఆ నెల 9న చోటుచేసుకున్న ఘర్షణ తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారతీయులతో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలిసింది. కాగా, సరిహద్దు వద్ద చైనా సైన్యం చొరబాటుకు సిద్ధంగా ఉందంటూ తమ దేశ మిలిటరీ ముందుగానే భారత్‌కు సమాచారం ఇచ్చిందంటూ అమెరికా వార్తాసంస్థ ఒకటి కథనాన్ని వెలువరించింది. భారత్‌, అమెరికా మిలిటరీల మధ్య సహకార విజయానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొంది. దీనిపై శ్వేతసౌధ ప్రతినిధిని ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ‘నేను ఆ విషయాన్ని ధ్రువీకరించలేను’ అని వెల్లడించారు. 

చైనా(China) ఏకపక్ష చర్యలతో సరిహద్దుల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.  జూన్‌ 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో రెండుదేశాల  బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. అప్పటినుంచి వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ.. పూర్తిస్థాయి ఫలితం మాత్రం దక్కడం లేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు