Iranian Drones: రష్యాకు డ్రోన్లు సరఫరా చేశాం.. అంగీకరించిన ఇరాన్‌!

రష్యాకు డ్రోన్‌ల సరఫరా విషయంపై ఇరాన్‌ మాట మార్చింది! మాస్కోకు ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లు మొదటిసారి అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమిర్‌అబ్దోల్లాహియాన్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 06 Nov 2022 01:23 IST

టెహ్రాన్‌: రష్యాకు డ్రోన్‌(Drones)ల సరఫరా విషయంపై ఇరాన్‌(Iran) మాట మార్చింది! మాస్కోకు ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లు మొదటిసారి అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమిర్‌అబ్దోల్లాహియాన్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా(Russia) సైనిక చర్య ప్రారంభానికి నెలల ముందే ఆ దేశానికి పరిమిత సంఖ్యలో డ్రోన్లు(Iran Drones) సరఫరా చేసినట్లు ఆయన టెహ్రాన్‌లో విలేకరులతో చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలను ఇరాన్‌ అధికారులు గతంలో ఖండించారు. ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ సైతం ఇటీవలే ఈ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఇరాన్‌ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు ఆయా నగరాలపై రష్యా.. డ్రోన్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇంధన వసతులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పుతిన్‌ సైన్యం ఇరాన్‌ డ్రోన్లను వాడుతోందని ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలు ఆరోపించగా.. తమ సైన్యం అటువంటి ఆయుధాలు వాడుతున్నట్లు తమకు తెలియదని క్రెమ్లిన్‌ వెల్లడించింది. ఇరాన్‌ సైతం.. రష్యాకు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయడం లేదని చెబుతూ వస్తోంది. అయితే, డ్రోన్లను సరఫరా చేసినట్లు తాజాగా అంగీకరించిన ఇరాన్‌ మంత్రి.. ఉక్రెయిన్‌లో వాటి వినియోగం గురించి మాత్రం తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ డ్రోన్లను ఉపయోగించినట్లు ఉక్రెయిన్‌ వద్ద ఆధారాలు ఉంటే.. మాకు అందజేయాలి. నిజమని తేలితే.. ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని