Iran Protests: ఆందోళనలపై ఉక్కుపాదం.. నిరసనకారుడికి ఉరి శిక్ష అమలు!

హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారిపై ఇరాన్‌(Iran) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిరసనకారుడికి ఉరి శిక్షను అమలు చేసింది. హిజాబ్‌ ఆందోళనలకు సంబంధించి అమలైన మొదటి మరణ శిక్ష ఇదే.

Published : 09 Dec 2022 01:40 IST

టెహ్రాన్‌: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారిపై ఇరాన్‌(Iran) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిరసనకారుడికి ఉరి శిక్షను అమలు చేసింది. హిజాబ్‌ ఆందోళనలకు సంబంధించి అమలైన మొదటి మరణ శిక్ష ఇదే. సెప్టెంబరు 25న దేశ రాజధాని టెహ్రాన్‌లో ఓ రోడ్డును బ్లాక్‌ చేయడంతోపాటు పారామిలిటరీ సిబ్బందిలో ఒకరిని గాయపరిచాడంటూ మొహసెన్‌ షెకారీ అనే వ్యక్తిపై నమోదైన అభియోగాలపై విచారణ చేపట్టిన కోర్టు.. అతన్ని దోషిగా తేల్చింది. శాంతిభద్రతలను దెబ్బతీయడంతోపాటు దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ నవంబరు 1న అతనికి మరణ శిక్షను విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అతను సుప్రీం కోర్టుకు వెళ్లినా..  ఆ తీర్పునే సమర్థించింది. ఈ క్రమంలోనే తాజాగా అతనికి ఉరి శిక్షను అమలు చేసింది.

మరోవైపు.. హక్కుల కార్యకర్తలు ఈ శిక్షను తీవ్రంగా ఖండించారు. దీన్ని బూటకపు న్యాయ ప్రక్రియగా అభివర్ణించారు. ‘మొహసెన్ షెకారీ ఉరిశిక్షపై.. అంతర్జాతీయ సమాజం బలంగా స్పందించాలి. లేనిపక్షంలో.. ఉరిశిక్షలు రోజువారీ వ్యవహారంగా మారతాయి’ అని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్(IHR) డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ట్వీట్‌ చేశారు. ‘ప్రజా తిరుగుబాటును మరింత అణచివేయడానికి, ప్రజల్లో భయాన్ని కలిగించడానికి ఈ శిక్షలు విధిస్తున్నారు’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు మరో 10 మందికి మరణశిక్ష పడినట్లు తెలుస్తోంది. మహ్సా అమీని మరణంతో దేశంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ఇరాన్‌ ఇటీవల రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని