Iran: గూఢచర్యంపై ఆరోపణలు.. మాజీ ఉన్నతాధికారిని ఉరి తీసిన ఇరాన్‌!

బ్రిటన్‌తో గూఢచర్యం ఆరోపణలపై తమ రక్షణశాఖ మాజీ ఉన్నతాధికారిని ఇరాన్‌ ఉరి తీసింది. ఆయన బ్రిటన్‌- ఇరానీయన్‌ జాతీయుడు కావడంతో.. ఇరాన్‌ చర్యను బ్రిటన్‌ తీవ్రంగా ఖండించింది.

Published : 15 Jan 2023 01:22 IST

టెహ్రాన్‌: స్థానిక ఆందోళనల(Iran Protests)పై ఉక్కుపాదం మోపడంతోపాటు నిరసనకారులకు మరణ శిక్ష అమలు చేస్తుండటంపై ఇరాన్‌(Iran) అంతర్జాతీయంగా విమర్శలపాలవుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడి ప్రభుత్వం చేసిన మరో పని చర్చనీయాంశమైంది. బ్రిటన్‌(Britain)తో గూఢచర్యాని(Spying)కి పాల్పడ్డారన్న అభియోగాలపై రక్షణశాఖ మాజీ ఉన్నతాధికారి అలీరెజా అక్బరీ(Alireza Akbari)కి ఉరిశిక్ష అమలు చేసింది. అవినీతితోపాటు గూఢచర్యం ద్వారా దేశ భద్రతకు హాని కలిగించినందుకు మరణ శిక్ష పడినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఇరాన్‌ ఆయన్ను ఉరి తీసింది. బ్రిటిష్- ఇరానియన్‌ జాతీయుడైన అక్బరీని ఉరి తీయడంపై బ్రిటన్‌ భగ్గుమంది. దీన్ని అనాగరిక చర్యగా పేర్కొంది.

‘సొంత ప్రజల హక్కులను గౌరవించని అనాగరిక ప్రభుత్వం తీసుకున్న ఓ క్రూరమైన, పిరిక చర్య ఇది’ అని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ విమర్శించారు. 61 ఏళ్ల అక్బరీ ఇరాన్‌ రక్షణ శాఖలో వివిధ ఉన్నత పదవులు నిర్వహించారని స్థానిక మీడియా పేర్కొంది. 1980-88ల మధ్య ఇరాన్- ఇరాక్ యుద్ధ అనుభవం ఉన్న అక్బరీ.. క్రమంగా బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌(ఎంఐ6)కు గూఢచారిగా మారాడని ఇరాన్‌ ఆరోపించింది. ఇందుకు బ్రిటన్‌ నుంచి భారీస్థాయిలో నగదు తీసుకున్నట్లూ తెలిపింది. ఆయన్ను 2019లోనే ఇరాన్‌ అరెస్టు చేసినట్లు భావిస్తున్నప్పటికీ.. కచ్చితమైన సమాచారం లేదు. మరోవైపు తాజాగా అక్బరీని ఉరితీసినట్లు చెప్పినప్పటికీ.. ఎప్పుడు చేశారనే విషయాన్నీ వెల్లడించలేదు.

అయితే, ఇదే సమయంలో అలీరెజా అక్బరీని ఇరాన్‌ అధికారులు చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఆడియోలు కూడా విడుదలయ్యాయి. నేరం చేసినట్లు అంగీకరించాలని బలవంతపెట్టారని.. చిత్రహింసలకు గురిచేశారని అక్బరీ చెబుతున్న ఆడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. ఇరాన్‌ చర్యలను బ్రిటన్‌, అమెరికాతోపాటు పలు దేశాలు ఖండించాయి. అక్బరీపై ఇరాన్‌ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని అమెరికా విదేశాంగ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌తో కలిసి పని చేశారని ఆరోపిస్తూ గతేడాది డిసెంబరులోనూ ఇరాన్‌ నలుగురిని ఉరితీసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని