United Nations: ‘ఇరాన్‌ మరణ శిక్షలు.. ప్రభుత్వ హత్యలతో సమానమే!’

స్థానికంగా ఆందోళనలను అణచివేసేందుకు ఇరాన్‌ ప్రభుత్వం.. ఉరి శిక్షలను ఆయుధంగా మలచుకుంటోందని ఐరాస ఆరోపించింది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మరణ శిక్షలను తక్షణమే నిలిపేయాలని ఉద్ఘాటించింది.

Published : 11 Jan 2023 00:45 IST

జెనీవా: దేశంలో కొనసాగుతోన్న ఆందోళనల(Iran Protests)ను ఇరాన్‌ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోన్న విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న పలువురికి మరణ శిక్షలూ విధిస్తోంది. ఇలా.. ఇప్పటికే నలుగురికి ఈ శిక్ష అమలు చేసింది. ఈ క్రమంలోనే.. ప్రదర్శనకారుల విషయంలో ఇరాన్‌(Iran) ధోరణిని ఐరాస(UN) తీవ్రంగా తప్పుపట్టింది. పౌరులను భయపెట్టేందుకు, వారి భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం మరణ శిక్షను ఆయుధంగా మలచుకుంటోందని విమర్శించింది. సరైన విచారణ ప్రక్రియ లేకుండా నిరసనకారులకు మరణ శిక్ష విధించడం.. ప్రభుత్వ హత్యలతో సమానమని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం(OHCHR) పేర్కొంది.

‘అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోంది. నిరసనకారులను శిక్షించేందుకు, అసమ్మతిని తొలగించేందుకు, ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకుగానూ.. న్యాయ విచారణలు, మరణ శిక్షలను ఆయుధంగా మలచుకుంటోంది. ప్రదర్శనల్లో పాల్గొనడం వంటి హక్కులను వినియోగించుకుంటోన్న పౌరులపై అలాంటి చర్యలు తీసుకోవడం.. ప్రభుత్వ హత్యలతో సమానం. ఈ నేపథ్యంలో.. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వారి హక్కులను గౌరవిస్తూ.. అవసరమైన చట్ట, విధానపర సంస్కరణలు చేపట్టాలి’ అని ఐరాస హక్కుల హైకమిషనర్ కార్యాలయం సూచించింది.

‘త్వరలో మరో ఇద్దరికి మరణ శిక్ష అమలు చేయనున్నట్లు మాకు సమాచారం అందింది. అయితే, ఇరాన్.. తన ప్రజల జీవితాలను, వారి అభిప్రాయాలను గౌరవించాలి. మరణ శిక్షలపై తక్షణమే మారటోరియం విధించాలి. వాటి అమలును నిలిపివేయాలి’ అని ఐరాస హక్కుల హైకమిషనర్ వోల్కర్‌ టర్క్ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా.. గతేడాది సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని