Iran: ఇరాన్‌ మంత్రి భారత పర్యటన రద్దు.. హిజాబ్‌ నిరసన దృశ్యాలే కారణం!

భారత్‌లో జరగనున్న ‘రైసినా డైలాగ్‌- 2023’ అంతర్జాతీయ సదస్సు ప్రచార వీడియోలో హిజాబ్‌ ఆందోళనల దృశ్యాలపై ఇరాన్‌ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ విదేశాంగమంత్రి వచ్చేనెల భారత్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

Published : 17 Feb 2023 21:40 IST

టెహ్రాన్‌: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు(Iran Protests) ఇరాన్‌ను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. మహిళలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్నారు. మొదట్లో కొంత మంది తమ జుత్తు కత్తిరించుకుని తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యం ఒకటి తాజాగా ఇరాన్‌(Iran) విదేశాంగ మంత్రి భారత పర్యటన రద్దుకు కారణమైంది! అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ORF) ఆధ్వర్యంలో విదేశాంగశాఖ సహకారంతో వచ్చే నెల భారత్‌లో ‘రైసినా డైలాగ్‌- 2023’ అంతర్జాతీయ సదస్సు(Raisina Dialogue) నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేనీ ఆమిర్‌ అబ్దుల్లాహియన్ రావాల్సి ఉంది.

అయితే, ఇటీవల విడుదల చేసిన రైసినా డైలాగ్‌(Raisina Dialogue 2023) ప్రచార వీడియోలో.. ఇరాన్‌ నిరసనల సమయంలో మహిళలు తమ జుత్తు కత్తిరించుకున్న దృశ్యాలతోపాటు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చిత్రం ఉండటంపై ఇరాన్‌ కలత చెందినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. దీంతో ఇరాన్ రాయబార కార్యాలయం.. ఓఆర్‌ఎఫ్‌, భారత విదేశాంగశాఖతో ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. వీడియోలోని ఆ భాగాన్ని తొలగించాలని నిర్వాహకులను కోరిందని, అయితే అలా జరగలేదని తెలుస్తోంది. దీంతో తమ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని నిర్వాహకులకు ఇరాన్‌ తెలిపినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. గతేడాది సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అయితే, ఇరాన్‌ ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపుతోందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు భారత్‌ ఈ నిరసనలపై అధికారికంగా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని