Iran: ఐస్‌క్రీం యాడ్‌ వివాదం.. ప్రకటనల్లో మహిళలపై నిషేధం

మహిళలతో రూపొందించిన ఐస్‌క్రీం వాణిజ్య ప్రకటనలు ఇరాన్‌లో పెను వివాదాన్ని రేపాయి. దీంతో దేశ సాంస్కృతిక శాఖ.. ఇకనుంచి ప్రకటనల్లో మహిళలు నటించడంపై నిషేధం విధించింది...

Updated : 18 Aug 2022 15:34 IST

టెహ్రాన్‌‌: మహిళలతో రూపొందించిన ఐస్‌క్రీం వాణిజ్య ప్రకటనలు ఇరాన్‌లో పెను వివాదాన్ని రేపాయి. దీంతో దేశ సాంస్కృతిక శాఖ.. ఇకనుంచి ప్రకటనల్లో మహిళలు నటించడంపై నిషేధం విధించింది. మహిళలు ఐస్‌క్రీం తింటున్నట్లుగా ఇటీవల ఇరాన్‌లో రెండు యాడ్‌లు విడుదలయ్యాయి. అయితే, అందులో హిజాబ్‌ను నిర్లక్ష్యం చేశారని, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపెట్టారని ఇరాన్‌ మత పెద్దలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలు మహిళా విలువలను అవమానించేవిగా, గౌరవ మర్యాదలను మంటగలిపేవిగా ఉన్నాయని ఆరోపించారు. సంబంధిత ఐస్‌క్రీం తయారీ సంస్థ ‘డొమినో’పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ క్రమంలోనే దేశంలోని అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలకు లేఖ రాసిన సాంస్కృతిక శాఖ.. హిజాబ్ పవిత్రత నియమాలను ఉటంకించింది. ఇకపై ఎటువంటి ప్రకటనల్లో నటించడానికి మహిళలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. మరోవైపు చాలా మంది మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఇటీవలి కాలంలో తమ స్వరాన్ని పెంచారు. ఈ క్రమంలోనే అనేక మంది నిర్బంధానికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని