Cannes: కేన్స్‌ వేదికగా ఇరాన్‌లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్‌ నిరసన

 ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) రాజకీయ వ్యాఖ్యలు, నిరసనలకు వేదికగా మారిపోయింది. కొద్దిరోజుల క్రితం ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) దండయాత్రకు నిరసనగా ఓ మహిళ నిరసన తెలుపగా, తాజా ఇరాన్‌ (Iran) మోడల్‌ తమ దేశంలోని మరణశిక్షలపై నిరసన తెలిపారు. 

Published : 29 May 2023 23:38 IST

కేన్స్‌: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Cannes Film Festival) ఈ ఏడాది రాజకీయ వ్యాఖ్యలు, నిరసనలకు వేదికగా మారిపోయింది. ఈ వేడుకలో రెడ్‌కార్పెట్‌ వేదికగా పలువురు నటులు, మోడల్స్‌ తమ దేశాల్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సాగిస్తున్న దండయాత్రకు నిరసనగా ఓ మహిళ ఉక్రెయిన్‌ జెండా రంగులున్న దుస్తులు ధరించి, ఒంటిపై ఎరుపు రంగు పోసుకుని నిరసన వ్యక్తం చేసింది. తాజాగా ఇరాన్‌ (Iran)కు చెందిన ఓ మోడల్‌ తమ దేశంలో అమలవుతున్న మరణశిక్షలను ఆపాలంటూ నిరసన తెలిపారు.  

మహలంగ జబేరి (Mahalanga Jberi) అనే మోడల్‌ ఉరి తాడు ఆకారంలో డిజైన్‌ చేసిన నల్లటి గౌను ధరించి రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. గౌను వెనుక స్టాప్ ఎగ్జిక్యుషన్స్‌ (Stop Executions) అని రాసి ఉంది. ఈ గౌనుకు సంబంధించిన వీడియోను జబేరి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా రెడ్‌ కార్పెట్‌ జబేరి నడిచిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు, రచయితలు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు. 

గతేడాది ఇరాన్‌లో 22 ఏళ్ల మాషా అమీని (Mahsa Amini) అనే యువతి హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంతో అక్కడి పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో ఆమె మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అమీని మృతికి నిరసనగా ఇరాన్‌ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రెండు నెలలపాటు నిరసనలు కొనసాగడంతో నైతిక పోలీస్‌ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, హిజాబ్‌ ఆందోళనలో పాల్గొన్న అయిదుగురు మహిళలు సహా వంద మందికి ఉరిశిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఇరాన్‌ ప్రభుత్వం ఎక్కువగా మరణశిక్షలు అమలు చేస్తున్నట్లు ఆ దేశంలో మానవహక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది సుమారు 200 మందిని ఇరాన్‌ ప్రభుత్వం ఉరి తీసినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. దీంతో వాటిని ఆపాలంటూ జబేరి కేన్స్‌లో నిరసన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని