Iran protests: ధిక్కరిస్తే ఉరిశిక్షే..! మృత్యువు ముంగిట 100 మంది నిరసనకారులు

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతోన్న ఆందోళనలు (Iran Protests) 100 రోజులకు చేరుకున్నాయి. వీటిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోన్న అక్కడి ప్రభుత్వం.. నిరసనకారులకు కఠిన శిక్షలు విధిస్తోంది. ఇప్పటికే 11 మందికి మరణశిక్ష అమలు చేయగా.. 100 మందికి ఉరిశిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.

Published : 30 Dec 2022 01:07 IST

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు చేపడుతోన్న నిరసనలు (Iran Protests) 100వ రోజుకి చేరుకున్నాయి. ఈ ఆందోళలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 400కుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఇరాన్‌ మహిళలు పట్టువిడవకుండా తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని అణచివేసేందుకు నిరసనకారులకు అక్కడి ప్రభుత్వం తీవ్ర శిక్షలు విధిస్తోంది. ఇప్పటికే పలువురికి మరణశిక్ష అమలు చేయగా.. మరో వంద మంది మరణం ముంగిట ఉన్నట్లు ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ (IHR) తాజా నివేదికలో వెల్లడించింది.

‘ఆందోళనల కారణంగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారిలో ఇప్పటివరకు 100 మంది మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు గుర్తించాం. ఇప్పటికే 11 మందికి మరణశిక్ష అమలయ్యింది. నిర్బంధంలో ఉన్నవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎక్కువ మంది న్యాయ సహాయం పొందలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి ఆందోళనలు చేసేవారికి మరణశిక్ష విధించడం ద్వారా.. నిరసనకారుల్లో భయం నెలకొల్పాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కొంతవరకు ప్రభావం చూపాయి. ఇలా మరణశిక్షలతో నిరసనకారులను బెదిరించాలని చూస్తున్నప్పటికీ.. అధికారుల వ్యూహం విఫలమవుతున్నట్లు గుర్తించాం’ అని ఐహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ మహమ్మూద్‌ అమీరి మొఘద్దామ్‌ పేర్కొన్నారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు మొత్తం 476 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 64 మంది చిన్నారులు, 34 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో మాసా అమీని అనే యువతిని ఈ సెప్టెంబర్‌లో అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో మొదలైన నిరసనలు దేశమంతటికీ వ్యాపించాయి. ఈ క్రమంలో భద్రతాదళాలు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. వీటిలో ఇప్పటివరకు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ భద్రతా విభాగం డిసెంబర్‌ తొలివారంలో వెల్లడించింది. ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు ఇతర నివేదికలు చెబుతున్నాయి. ఐరాస నివేదిక ప్రకారం, నిరసనల్లో పాల్గొన్న వారిలో 14వేల మందిని అక్కడి భద్రతా దళాలు అరెస్టు చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు