Published : 16 Aug 2022 01:18 IST

Salman Rushdie: వారే కారణం..! రష్దీ దాడి ఘటనపై ఇరాన్‌ స్పందన

టెహ్రాన్‌: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి వెనుక ఇరాన్‌ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసింది. ఈ వ్యవహారంపై తొలిసారి అధికారికంగా స్పందించిన ఇరాన్‌.. ఈ దాడి విషయంలో తమపై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. రష్దీ, ఆయన మద్దతుదారులే దానికి కారణమని టెహ్రాన్‌లోని విదేశాంగశాఖ సోమవారం పేర్కొంది. 1988లో రష్దీ నవల ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’(The Satanic Verses) తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆయన్ను చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా రుహొల్లా ఖొమేనీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దాడి వెనుక ఇరాన్‌ హస్తంపై ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇరాన్‌ విదేశాంగశాఖ ప్రతినిధి నాసర్ కనాని మాట్లాడుతూ.. సల్మాన్ రష్దీపై దాడి విషయంలో ఆయన, ఆయన మద్దతుదారులను తప్ప మరెవరినీ నిందించబోమని అన్నారు. ఈ విషయంలో ఇరాన్‌పై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆయన తన రచనల్లో ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ‘వాక్ స్వాతంత్ర్యం’ సమర్థించదని అన్నారు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీయం ద్వారా ఆయన ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తుచేశారు. ఆయనపై దాడికి పాల్పడిన అనుమానితుడి గురించి మీడియాలో వచ్చిన సమాచారం తప్ప తమకు వేరే ఇతర సమాచారం లేదని తెలిపారు.

భారత సంతతికి చెందిన సల్మాన్‌ రష్దీ గత శుక్రవారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం కాస్త మెరుగుపడింది. మాట్లాడగలిగే పరిస్థితికి చేరుకోవడంతో వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా నేతలు, రచయితలు ఆయనపై దాడిని ఖండించారు. ఈ ఘటనలో నిందితుడిని లెబనాన్‌ మూలాలున్న అమెరికా జాతీయుడిగా గుర్తించారు. హత్యాయత్నానికి సంబంధించిన అభియోగాలు రుజువైతే అతనికి 32 ఏళ్లవరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని