హిజాబ్‌ ఆందోళనలు: అనారోగ్యంతోనే ‘ఆమె’ మరణించిందన్నఇరాన్‌!

తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల మాసా అమినీ చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు కొరోనర్‌ నివేదికలో తేలిందని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ఐఆర్‌ఎన్‌ఏ శుక్రవారం పేర్కొంది.

Published : 08 Oct 2022 01:13 IST

టెహరాన్‌: హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు ఇరాన్‌ (Iran)ను కుదిపేస్తున్నాయి. మాసా అమీని (Mahsa Amini) అనే యువతి మృతితో ఈ ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమీని మృతిపై విచారణ చేపట్టిన అధికారి నివేదిక మాత్రం దీనికి భిన్నంగా ఉంది. తల, శరీర భాగాలకు దెబ్బలు తగలడం వల్ల ఆమె చనిపోలేదని.. సెరిబ్రల్ హైపాక్సియా (Cerebral Hypoxia) కారణంగా అవయవాల వైఫల్యంతో మరణించినట్లు అందులో తేలిందని ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ శుక్రవారం పేర్కొంది.

కస్టడీలో అమినీకి గాయాలయ్యాయని, ఆమె మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, తల, కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం వల్ల అమినీ మరణించలేదని నివేదిక పేర్కొంది. కానీ, ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతర్లీన వ్యాధుల కారణంగా కస్టడీలో ఉన్న సమయంలో ఆమె కుప్పకూలిందని తెలిపింది. శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ఆమె హైపాక్సియాకు గురైందని, ఫలితంగా మెదడు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో నేటికీ వేలమంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు యత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని