Iran: ఇరాన్‌ ఆందోళనలు.. పిట్టల్లా రాలిపోతోన్న యువతులు..!

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతోన్న నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.

Published : 29 Sep 2022 01:25 IST

దిల్లీ: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతోన్న నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఆందోళన చేస్తోన్న మహిళలపై ఉక్కుపాదం మోపుతోన్న అక్కడి భద్రతా దళాలు.. విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హిజాబ్‌ లేకుండా నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధమైన హదీస్‌ నజాఫీ (20) అనే యువతి వీడియో ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆ అమ్మాయి దుండగుల చేతిలో హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం నజాఫీనే కాకుండా ఇలా ఆందోళనల్లో పాల్గొన్న ఎంతోమంది యువతులు ఇరాన్‌ భద్రతా దళాల చేతిలో ప్రాణాలు కోల్పోతుండడం తీవ్రంగా కలచివేస్తోంది.

హిజాబ్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న హదీస్‌ నజాఫీ శరీరంపై పలుచోట్ల బుల్లెట్‌ గాయాలున్నట్లు వెల్లడైంది. కడుపు, మెడ, గుండెతోసహా మొత్తం ఆరుచోట్ల బుల్లెట్‌ గాయాలు చూస్తుంటే అక్కడి భద్రతా దళాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయో అర్థమవుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. నిరసనల్లో పాల్గొనకముందు నజాఫీ వీడియోలు, మరణం తర్వాత ఆమె సమాధి వద్ద పలువురు నివాళులు అర్పిస్తున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

హదీఫ్‌ నజాఫీతో పాటు ఘజేల్‌ చెలవీ (32) అనే పర్వతారోహకురాలు కూడా ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయారు. అమోల్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఈ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు హిజాబ్‌ వ్యతిరేక నిరసనల్లో భద్రతా దళాలు చేసిన కాల్పుల్లో హనానే కియా (23), మహషా మగోయ్‌ (18)లు పిట్టల్లా రాలిపోయారు. ఇలా గత 11 రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 76 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఎక్కువ మంది  యువతులే ఉండడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

ఇదిలాఉంటే, హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్‌లో మాసా అమీని అనే యువతిని అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 16న మరణించారు. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న మొదలైన నిరసనలు.. ఇరాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని