ఉక్రెయిన్- రష్యా వార్ వేళ ట్రెండింగ్‌లోకి #ఇరానియన్‌.. అంతా బైడెన్‌ పుణ్యమే!

Ukraine Crisis: ఇరానియన్‌ అనే పదం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. అసలు ఏ సంబంధమూ లేని ఇరానియన్‌ అనే పదం ఎందుకు తెరపైకి వచ్చిందంటే..?

Published : 03 Mar 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వైపు రష్యా సేనలు ఉక్రెయిన్‌లోకి చొచ్చుకెళ్తున్నాయి. దీంతో రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పెద్దన్న అగ్రరాజ్యం సైనిక చర్యపై విరుచుకుపడుతోంది. ఈయూ దేశాలు సైతం పుతిన్‌ దురాక్రమణను ఖండిస్తున్నాయి. భారత్‌, చైనా శాంతి మంత్రం జపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వేళ ఇలా వివిధ దేశాలు తమ తమ వైఖరిని తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో ఇరానియన్‌ అనే పదం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. అసలు ఏ సంబంధమూ లేని ఇరానియన్‌ అనే పదం ఎందుకు తెరపైకి వచ్చిందంటే..?

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ను సైన్యంతో చుట్టుముట్టినా ఆ దేశ ప్రజల మనసులను మాత్రం పుతిన్‌ గెలుచుకోలేరని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఉక్రెనియన్లు’ అని పలకడానికి బదులు ‘ఇరానియన్లు’ అని పలికారు. దీంతో కాసేపటికే ఈ పదం ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. కొందరు బైడెన్‌ పొరపాటుపై మీమ్స్‌ కూడా రూపొందించారు. ఇదే అదునుగా రిపబ్లికన్‌ మద్దతుదారులు ట్విటర్‌లో డెమొక్రాట్లపై విమర్శల వర్షం కురిపించారు.

బైడెన్‌ ఈ విధంగా పొరపాటుగా పలకడం కొత్తేం కాదు. గతంలో వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ గురించి ప్రస్తావిస్తూ ‘ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌’ అని సంబోధించారు. చిన్నతనంలో నత్తి ఉండడం వల్ల బైడెన్‌ ప్రసంగాల్లో చాలాసార్లు ఇలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. దీన్ని అధిగమించేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇదిగో ఒక్కోసారి ఇలా దొరికిపోతుంటారు!!






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని