Iran: సొంత జట్టు ఓటమికి సంబరాలు చేసుకొన్న ఇరానీయులు..!

సొంత జట్టు ఓటమికి ఇరాన్‌ జాతీయులు సంబరాలు చేసుకొన్నారు. కొన్నాళ్లుగా ఆ దేశంలో జరుగుతున్న నిరసనల్లో ఇవి కూడా ఓ భాగమయ్యాయి.  

Published : 01 Dec 2022 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో సొంత జట్టు ఓటమికి ఇరాన్‌ జాతీయులు సంబరాలు చేసుకొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరాన్‌ జాతీయులు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఇరాన్‌లో హిజాబ్‌, అణచివేతకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం. తమ నిరసనల్లో భాగంగానే ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఓటమికి ఆందోళనకారులు ఉత్సవాలు చేసుకొన్నారు. చాలా మంది వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. ముఖ్యంగా మాషా అమిని సొంత ఊరు సకీజ్‌ సహా పలు నగరాల్లో ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయి. మ్యాచ్‌లో అమెరికన్లు తొలి గోల్‌ చేయగానే సకీజ్‌లో టపాసులు పేల్చినట్లు ‘ఇరాన్‌ వైర్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. ‘‘అమెరికన్లు గోల్‌ చేస్తే నేను మూడు మీటర్ల ఎత్తు ఎగిరి గెంతుతానని ఎప్పుడూ అనుకోలేదు’’ అని జర్నలిస్టు సయీద్‌ జఫ్రానీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మరోవైపు ఖతార్‌లో ఉన్న ఇరాన్‌ జట్టు కూడా ప్రభుత్వ వైఖరిపై గుర్రుగానే ఉంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా జాతీయ గీతం పాడేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌లో తమ ఆటగాళ్ల ప్రవర్తన సరిగ్గా లేకపోతే వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని ‘ది రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌’(ఐఆర్‌జీసీ) హెచ్చరించింది. ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇరాన్‌ జట్టు క్రీడాకారులపై ఓ కన్నేసి పెట్టేందుకు డజన్ల సంఖ్యలో ఐఆర్‌జీసీ సభ్యలు వచ్చారు. ఆటగాళ్లు మరే దేశీయులతో కలవకుండా వీరు కట్టడి చేస్తున్నారు. 1979లో ఇరాన్‌ విప్లవం తర్వాత తొలిసారి  తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వీటిల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని