Biden: బైడెన్‌ పార్కిన్సన్స్‌ చికిత్స తీసుకుంటున్నారా?.. స్పందించిన వైట్‌హౌస్‌

Biden: బైడెన్‌ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. వైట్‌హౌస్‌కు పార్కిన్సన్స్‌ స్పెషలిస్ట్‌ రావడం మరో చర్చకు తెర తీసింది.

Published : 09 Jul 2024 10:25 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఆరోగ్యంపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం మరో వివాదానికి తెర తీసింది. అమెరికాలో పార్కిన్సన్స్‌ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఓ వైద్యుడు ఈ ఏడాది బైడెన్‌ వ్యక్తిగత డాక్టర్‌ను కలిసినట్లు శ్వేతసౌధం లాగ్‌ బుక్‌ ద్వారా తెలిసింది. దీంతో అధ్యక్షుడు పార్కిన్సన్స్‌ చికిత్స తీసుకుంటున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

వీటిని వైట్‌హౌస్‌ ఖండించింది. బైడెన్‌కు (Biden) ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఏ చికిత్సా తీసుకోవడం లేదని అధికార ప్రతినిధి కరీన్‌ జీన్‌ పియర్ వెల్లడించారు. సాధారణ చెకప్‌లో భాగంగానే ఓ న్యూరాలజిస్ట్‌ వైట్‌హౌస్‌కు వచ్చారని ధ్రువీకరించారు. ఆయనెవరు, ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. భద్రతా కారణాలరీత్యా అలాంటి వివరాలు బహిర్గతం చేయడం సరికాదని నొక్కిచెప్పారు.   ఈ సమయంలో విలేకరులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ.. ఆయా వ్యక్తుల గోప్యత, భద్రతరీత్యా వాటిని వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పారు.

కొవిడ్‌ తర్వాత బైడెన్ (Biden) తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని మరో అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలోనే వైద్యులు వైట్‌హౌస్‌కు వచ్చారని తెలిపారు. అలాగే శ్వేతసౌధ సిబ్బందిలో చాలామంది ఆరోగ్య పరీక్షల నిమిత్తం వైద్య సిబ్బంది తరచూ అధ్యక్ష నివాసానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు. ఆ వివరాలన్నీ సందర్శకుల రిజిస్టర్‌లో ఉంటాయని తెలిపారు. అంతమాత్రాన బైడెన్‌కు చికిత్స జరుగుతుందని పేర్కొనడం సరికాదని హితవు పలికారు.

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌తో సంవాదంలో బైడెన్‌ (Biden) తడబడిన విషయం తెలిసిందే. మరోవైపు అంతకుముందు ఆయన పలుమార్లు స్టేజిపై  ఆందోళనకరంగా ప్రవర్తించిన ఘటనలూ ఉన్నాయి. వెళ్తూవెళ్తూ ఒక్కసారిగా నిలిచిపోవడం, దారి మర్చిపోవడం వంటి సందర్భాలూ అందరూ చూశారు. దీంతో వయసురీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో బైడెన్‌ బాధపడుతున్నారనే వాదన తెరమీదకొచ్చింది. ఆయన జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని కొందరు విశ్లేషించారు. ఈనేపథ్యంలోనే తాజాగా వైట్‌హౌస్‌లోకి వైద్యుడి సందర్శన పలు అనుమానాలకు తెరతీసింది.

ఏంటీ పార్కిన్సన్స్‌?

నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యే పార్కిన్సన్స్‌ వ్యాధి. మెదడులో నాడీ కణాల మధ్య నిరంతరం సమాచార మార్పిడి అవుతుంటుంది. ఇందుకు కొన్ని వాహకాలు (రసాయనాలు) తోడ్పడతాయి. వీటిల్లో డోపమిన్‌ ఒకటి. ఇది శరీర కదలికలను నియంత్రించే బేసల్‌ గాంగ్లియాలోని సబ్‌స్టాన్షియా నైగ్రా అనే భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది క్షీణించటమే పార్కిన్సన్స్‌ జబ్బుకు మూలం. నాడీ కణాలు క్షీణించినా, అవి సరిగా పనిచేయకపోయినా డోపమిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా కదలికల సమస్యలు మొదలవుతాయి. తల, చేతులు వంటి భాగాలు వణకటం.. బిగుసుకుపోవటం, నడక వేగం తగ్గటం, సరిగా మాట్లాడలేకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇది శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తుంది. కుటుంబసభ్యులు, కనిపెట్టుకునేవారికీ చిక్కులు తెచ్చిపెడుతుంది. ముఖ కవళికలను సరిగా వ్యక్తం చేయలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం వల్ల భావోద్వేగ సమస్యలూ తెచ్చిపెడుతుంది. దీని లక్షణాలు చాలాసార్లు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి. నడక వేగం తగ్గటం, మాట తత్తరపోవటం, హుషారుగా లేకపోవటం వంటివన్నీ వృద్ధాప్య లక్షణాలని పొరపడేలా చేస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని